కరీంనగర్ కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష..కీలక నిర్ణయాలు

  • Published By: madhu ,Published On : February 13, 2020 / 04:24 PM IST
కరీంనగర్ కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష..కీలక నిర్ణయాలు

సాగునీటి రంగానికి సంబంధించిన విషయంలో సీఎం కేసీఆర్…కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 2020, ఫిబ్రవరి 13వ తేదీ గురువారం కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనితీరును ఆయన పరిశీలించారు.

అనంతరం సాయంత్రం సాగునీటి రంగంపై అధికారులతో సమీక్ష జరిపారు. భారీ మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. సాగునీటికి సంబంధించిన ఇంజినీరింగ్ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకరావాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి ఇంజినీరింగ్ వ్యవస్థను 11 సర్కిళ్లుగా విభజన చేయనున్నట్లు, సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజినీర్ ఉంటారని అధికారులకు తెలిపారు. 

అనంతరం నాలుగు నెలల్లో జరగాల్సిన పనులను అధికారులకు వివరించారు. 2020, జూన్ నెలాఖరులోపు ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లోని ఖాళీలన్నీ భర్తీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ నెలాఖరులోపు ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని. మే నెలాఖరులోగా సాగునీటి కాల్వలకు అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని, 550 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రస్తుత కలెక్టరేట్ల స్థానంలో కొత్త కలెక్టరేట్లను మంజూరు చేయాలన్నారు.