మున్సిపోల్స్‌లో టీ-బీజేపీకి వింత పరిస్థితి!

  • Published By: sreehari ,Published On : January 21, 2020 / 01:29 PM IST
మున్సిపోల్స్‌లో టీ-బీజేపీకి వింత పరిస్థితి!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం అన్ని వార్డులు, డివిజన్ల నుంచి తాము పోటీ చేయడం ఖాయమని బీజేపీ నేతలు ఊదరగొట్టారు. రాష్ట్రంలో మొత్తం 2727 మునిసిప‌ల్  వార్డులు .. 385 కార్పొరేష‌న్ డివిజన్లలో పోటీకి దిగుతామ‌ని చెప్పుకొచ్చారు. ఐదు నెల‌ల ముందు నుంచే స‌న్నాహ‌క కార్యక్రమాలు చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా క్లస్టర్లరను ఏర్పాటు చేసి క‌మిటీలు సైతం వేశారు. ప్రచారానికి స‌మీప గ్రామాల నుంచి యువ‌త‌ను మోహ‌రిస్తామ‌ని, ప్రజ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలే ప్రధాన అజెండా అంటూ చెప్పుకొచ్చారు. కానీ తీరా పోటీలో దిగే స‌మ‌యానికి అభ్యర్థులే కరువ‌య్యారు. ఉన్న చోట అతివృష్టి.. లేని చోట్ల అనావృష్టి అన్నట్టు త‌యారైంది బీజేపీ పరిస్థితి. మొత్తం మీద మున్సిపాలిటీల్లో 2070  వార్డులకు, కార్పొరేషన్లలో 347 డివిజన్లలో మాత్రమే బీజేపీ అభ్యర్థులు పోటీకి నిలిచారు. 

వలసలతో అభ్యర్థుల్లో పోటీ :
ఉత్తర తెలంగాణ‌లో బీజేపీ త‌న‌ ప‌ట్టు సాధించుకునేందుకు చేసిన ప్రయ‌త్నాలు ఆ పార్టీలో పోటీని పెంచాయి. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గ‌తంలో అభ్యర్థులు కరువ‌య్యే వారు. ఈసారి ఆ పరిస్థితి రివ‌ర్స్ అయ్యింది. చాలా మునిసిపాలిటీల్లో అభ్యర్థులు పోటీకి ఎగ‌బ‌డ్డారు. పార్టీలో చేరిక‌లు, సీఏఏ ఎఫెక్ట్‌తో ప్రజ‌ల్లోకి బీజేపీ గ‌తంలో ఎన్నడూ లేని విధంగా వెళ్లింది. ఇత‌ర పార్టీల‌ నుంచి కూడా వ‌ల‌స‌లు పెర‌గడంతో మున్సిపాలిటీల్లో అభ్యర్థుల మ‌ధ్య పోటీ అనూహ్యంగా పెరిగిందంటున్నారు. కొన్ని వార్డుల్లో త‌మ‌కు టికెట్ ఇవ్వలేద‌ని రాష్ట్ర కార్యాల‌యానికి వ‌చ్చిన నిజామాబాద్ మున్సిపాలిటీ ఆశావహులు.. టికెట్లు తమను కాదని.. డ‌బ్బులిచ్చిన వారికే ఇస్తున్నార‌ని అధ్యక్షుడిని నిల‌దీశారు. 

కామారెడ్డిలో త‌మ‌కు టికెట్ ఇవ్వనందుకు ఏకంగా జిల్లా అధ్యక్షుడు బానాల ల‌క్ష్మారెడ్డిపై దాడులు చేసేందుకు య‌త్నించారు. హుజూరాబాద్‌లో అభ్యర్థులు గొడ‌వ‌లు పెట్టుకుని బీ ఫాం చించుకునే వ‌ర‌కు వెళ్లింది. దీంతో బీజేపీ పార్టీ గెలుపు అవ‌కాశాలు ఎలా ఉన్నా పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎగ‌బ‌డ‌టంతో నాయ‌క‌త్వం త‌ల‌లు ప‌ట్టుకుంది. మరోపక్క, హైద‌రాబాద్ న‌గ‌ర శివారు ప్రాంతాల మున్సిపాలిటీల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపించాయి. పార్టీ తరఫున నిల‌బెట్టేందుకు అభ్యర్థులు క‌రువ‌య్యారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంప‌ట్నంలో 24 వార్డుల‌కు 3 స్థానాల్లో, జ‌ల్ ప‌ల్లిలో 27 స్థానాల‌కు 7, ప‌ర‌కాల‌లో 22  స్థానాల‌కు 4, చెన్నూరులో 18కి 10 స్థానాల్లో మాత్రమే నామినేష‌న్లు దాఖలయ్యాయి.

మైనార్టీ ఓట్లే కారణమా? :
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ ప‌డి మ‌రీ ఇక్కడ అభ్యర్థులు బరిలోకి దిగితే  ప‌ట్టణ ప్రాంతాల్లో  బలంగా ఉన్నామని చెప్పుకునే బీజేపీ నేత‌లు క‌నీసం త‌న అభ్యర్థులను కూడా బరిలోకి దించలేకపోయారు. ఇందుకు కార‌ణం ఆయా ప్రాంతాల్లో మైనారిటీ ఓట్లు ఎక్కువ‌గా ఉండ‌ట‌మే కార‌ణ‌మని చెప్పుకుంటున్నారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నేత‌లు బెదిరింపుల‌కు పాల్పడి త‌మ అభ్యర్థులను పోటీలో లేకుడా చేశార‌ని బీజేపీ నేతలు అంటున్నారు.

చెన్నూరు, ఖ‌మ్మం, స‌త్తుప‌ల్లి, ప‌ర‌కాల, భైంసా వంటి అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ బెదిరింపుల‌తో త‌మ అభ్యర్థులు పోటీ నుంచి త‌ప్పుకున్నార‌ని ఆరోపిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ బెదిరింపులు, డ‌బ్బుల ఆశ, మైనారిటీ ఓట్ల వంటి కుంటి సాకులు చెబుతున్న బీజేపీ క‌నీసం అభ్యర్థులను బరిలోకి దించలేక నామినేష‌న్ల స‌మ‌యంలోనే అభాసుపాలైందని జనాలు అంటున్నారు. గొప్పలు చెప్పుకొని బాకా ఊదిన పార్టీ నేతలు ఇప్పుడేం చెప్తారో చూడాలని గుసగుసలాడుతున్నారు.