50 మున్సిపాలిటీలపై కాంగ్రెస్ నమ్మకం వెనుక లెక్కలేంటి?

  • Published By: sreehari ,Published On : January 24, 2020 / 03:34 PM IST
50 మున్సిపాలిటీలపై కాంగ్రెస్ నమ్మకం వెనుక లెక్కలేంటి?

గ‌త‌మెంతో కీర్తి క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అస్థిత్వ స‌మ‌స్యను ఎదుర్కొంటోంది. గ‌త రెండు ప‌ర్యాయాలు జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌తోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నిక‌ల్లో పార్టీ అనూహ్యంగా ప‌ట్టు కోల్పోయింది. ప‌దేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించడ‌మే కాక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా సానుభూతి ఉన్నా… నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వయం లేక‌పోవ‌డం పార్టీ పాలిట శాపంగా మారింద‌ని పార్టీలోని వర్గాలే గుసగుస లాడుకుంటున్నాయి.

ప‌ది జిల్లాల‌ ప్రాతిపదికగా గతంలో జ‌రిగిన మున్సిపల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ హోరాహోరిగానే పోటీ పడ్డాయి. అప్పుడు 52 మున్సిపాల్టీలుండ‌గా టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 20 కైవ‌సం గెలుచుకున్నాయి. బీజేపీ 3, టీడీపీ 4, మ‌జ్లిస్ ఒక మున్సిపాల్టీ చేజిక్కించుకున్నాయి.

ఆ రెండు కార్పొరేషన్లలోనూ :
రాష్ట్రంలో టీఆర్ఎస్‌ అధికారంలో ఉండడంతో ఆ తర్వాత రాజ‌కీయ ప‌రిణామాల్లో కాంగ్రెస్, టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్లతో స‌హా అంతా అధికార పార్టీలోకి చేరిపోయారు. కార్పొరేష‌న్లలో కూడా కారు జోరు కొన‌సాగింది. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాల్టీలతో ఇప్పుడు మొత్తం 120 ఉన్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో
కాంగ్రెస్ అన్నింటా పోటీ చేస్తోంది.

కార్పొరేషన్లు, మున్సిపాల్టీల‌లో కాంగ్రెస్ 2616 మంది అభ్యర్థుల‌ను బ‌రిలోకి దింపింది. కొన్ని చోట్ల వామపక్షాలతో స‌ర్దుబాటు చేసుకోగా.. మ‌రికొన్ని చోట్ల అభ్యర్థుల‌ను నిల‌బెట్టలేక‌పోయింది. మొత్తం 436 చోట్ల హ‌స్తం గుర్తు బ్యాలెట్‌లో లేకుండాపోయింది. వీటిలో పార్టీ అంచనాల ప్రకారం ఓ 50 మున్సిపాల్టీల‌తో పాటు రెండు కార్పొరేష‌న్లలో విజయం సాధించవచ్చంట.

ఆ ఓట్లపైనే కాంగ్రెస్ ఆశలు :
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక‌త‌, ఆ పార్టీలోఉన్న అంత‌ర్గత విభేదాలు, టీఆర్ఎస్‌ రెబ‌ల్స్ ద్వారా చీల్చే ఓట్లపైనే కాంగ్రెస్‌ పార్టీ ఆశలు పెట్టుకుందంటున్నారు. ఈసారి కాంగ్రెస్ నుంచి నామినేషన్లు వేసినా అభ్యర్థులను ప్రలోభాల‌కు గురికాకుండా చివ‌రి వ‌ర‌కు పోటీలో కొనసాగేలా ఉంచ‌డ‌మే పెద్ద విజ‌యమని ఆ పార్టీ నాయకులు లోలోపల అనుకుంటున్నారట. ఎక్కడికక్కడ స్ధానిక నాయ‌క‌త్వం కూడా గ‌తానికి భిన్నంగా అధికార పార్టీ అధికార దుర్వినియోగాన్ని క‌ట్టడి చేసేందుకు పని చేశారని చెబుతున్నారు.

దీంతో పాటు పార్టీ విజ‌న్ డాక్యుమెంట్ అంశం కూడా ప్రజ‌ల్లో మంచి సానుభూతిని సాధించి పెట్టింద‌ని ఆశపడుతున్నారట. ఓటర్లను ఆకర్షించడంలో ఈసారి కాంగ్రెస్‌ పార్టీ బాగానే సక్సెస్‌ అయ్యిందనే అభిప్రాయం వారిలో ఉందంట. పార్టీ శాస‌న‌స‌భ్యులున్న చోట కచ్చితంగా గెలుస్తామనే ధీమా పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.

మునుగోడు, సంగారెడ్డి, కొత్తగూడెం, ములుగు, మంథని అంసెబ్లీ నియోజకవర్గాలతో పాటు మ‌ల్కాజిగిరి, భువన‌గిరి, న‌ల్లగొండ, చేవెళ్ల, నాగ‌ర్ క‌ర్నూలు, జ‌హీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయట.

వీటితో పాటు తక్కువ ఓట్లతో ఓడిపోయిన నియోజకవర్గాల్లో సైతం తప్పకుండా ఈసారి ప్రభావం చూపిస్తామని చెబుతున్నారు. మొత్తానికి రాష్ట్రంలో ఈ ఎన్నిక‌లు ముగిస్తే ఇక నాలుగేళ్ల వ‌ర‌కు ఏ ఎన్నిక‌లు లేవు. ఈ పరిస్థితుల్లో వ‌రుస ఓట‌ములతో దిగాలుగా ఉన్న కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు మున్సిపల్‌ ఎన్నికలు ఉపయోగపడతాయని అంటున్నారు. మరి కాంగ్రెస్‌ ఆశలు ఫలిస్తాయో లేదో అన్నది 25వ తేదీన తేలిపోతుంది.