అసలు మైనస్‌.. ఓటమికి సాకుల వెతుకులాటలో కాంగ్రెస్‌!

  • Published By: sreehari ,Published On : February 4, 2020 / 02:35 PM IST
అసలు మైనస్‌.. ఓటమికి సాకుల వెతుకులాటలో కాంగ్రెస్‌!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్… ఇందుకు సాకులను వెతికే పనిలో పడిందంట. ఈ ఓట‌మికి నాయ‌క‌త్వ లోప‌మో.. లేక‌, ఓట‌ర్ల తిర‌స్కర‌ణ కారణం కాద‌ంటోంది. ఇదంతా అధికార యంత్రాంగం చేసిన పనే అంటూ దుయ్యబడుతోంది. అధికార పార్టీ వేసిన స్కెచ్‌ వల్లే తమ పార్టీ ఓటమి పాలైందని గగ్గోలు పెడుతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ చిన్న చిక్కులు ఎదురైనా ప్రభుత్వ ఉన్నతాధికారుల వైఖ‌రే కారణం అనడం అలవాటుగా మారిందని జనాలు అనుకుంటున్నారు. పార్టీలో లోపించిన సమన్వయం కంటే అధికార పార్టీ వ్యూహాలు, పోలీసులు, ఎన్నిక‌ల అధికారుల కారణంగానే తాము ఓడిపోతున్నామని ఆ పార్టీ నేతలు పదే పదే వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా సేవ్ కాన్‌స్టిట్యూష‌న్, సేవ్ నేష‌న్ పేరుతో గాంధీభ‌వ‌న్ నుంచి అంబేద్కర్ విగ్రహం వ‌ర‌కు ర్యాలీ చేసేందుకు అనుమ‌తి కోరితే.. పోలీసులు నో అన్నారు. అప్పుడు న‌గ‌ర పోలీసు క‌మీష‌న‌ర్ అంజ‌నీ కుమార్‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ డీజీపీతో పాటు… గ‌వ‌ర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఉత్తమ్ వైఖ‌రిని ఖండించారు.

తాజాగా మున్సిపల్ ఎన్నిక‌ల్లో ఎన్నికల సంఘంపై ముందు నుంచి ఆరోప‌ణలు చేస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఇందులో ప్రధానంగా షెడ్యూల్‌ విడుద‌ల‌కు, నోటిఫికేష‌న్‌కు మధ్య స‌మ‌యం లేక‌పోవ‌డం, రిజ‌ర్వేష‌న్ల ప్రక్రియ‌, ఓట‌ర్ల జాబితా వ్యవ‌హారంలో అభ్యంత‌రాలు వ్యక్తం చేస్తూ స్వయానా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. కోర్టు తీర్పు అనంత‌రం నోటిఫికేష‌న్ విడుద‌ల‌ చేసిన‌ ఎన్నిక‌ల సంఘంపై ప్రతి రోజు ఏదో ఒక అంశంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

కేవీపీ ఓటుపై రభస :
చివరకు చైర్మన్లు, మేయ‌ర్ల ఎన్నిక‌ల‌లో ఎక్స్ అఫిషియో స‌భ్యుల వ్యవ‌హారం రాష్ట్రంలో  పెను తుఫాను సృష్టించింది. మ‌రీ ముఖ్యంగా ఉత్తమ్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని నేరుడుచ‌ర్లలో కేవీపీ రామచంద్రరావు ఓటుపై తీవ్ర ర‌భ‌స జ‌రిగింది. కాంగ్రెస్ ముంద‌స్తు వ్యుహం లేక‌పోవ‌డం, గెలిచిన వారిలో న‌మ్మకం క‌ల్పించ‌క‌పోవ‌డం వంటి కారణాల వల్ల ఊహించ‌ని ప‌రిణామాలు జరిగాయి.

కానీ, అవన్నీ పక్కన పెట్టేసి మ‌ళ్లీ ప్రభుత్వ యంత్రాంగాన్నే త‌ప్పుప‌ట్టింది కాంగ్రెస్. కొన్ని సందర్భాల్లో అటుఇటుగా వ్యవహారాలు జరిగి ఉండొచ్చు గానీ.. పూర్తిగా ఆ కారణాల వల్లే ఓటమి పాలయ్యామంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు. తాజాగా రాష్ట్ర గ‌వ‌ర్నర్‌తో తన సతీమణితో పాటు క‌ల‌సిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. ఎన్నిక‌ల ప‌రిణామాల‌న్నింటి పై ఫిర్యాదు చేశారని అంటున్నారు. 

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ వైఖ‌రిపై అటు ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, ఇటు పార్టీలోనూ వ్యతిరేక‌త వ్యక్తం అవుతోందట. ప్రతి అంశాన్ని ఉద్యోగుల‌కు ముడి పెట్టడం పై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారట. మరోపక్క, పార్టీతో సంబంధం లేకుండా తన భార్యతో కలిసి గవర్నర్‌ దగ్గరకు వెళ్లడం పార్టీ నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది.

ఇది కుటుంబ కార్యక్రమం అనుకుంటున్నారా అని లోలోపల రగిలిపోతున్నారట. కుటుంబంతో గవర్నర్‌ను కలసినప్పుడు రాజ‌కీయాల గురించి చ‌ర్చించ‌డం ఎందుకని అంటున్నారట. మొత్తం మీద ఓటమి నేపథ్యంలో అటు పార్టీలోనూ, ఇటు అధికార యంత్రాంగంలోనూ ఉత్తమ్‌ పరిస్థితి అంత ఉత్తమంగా లేదంటున్నారు.