మేమూ రె’ఢీ’ : కాంగ్రెస్ జాబితా సిద్ధం

  • Published By: chvmurthy ,Published On : March 12, 2019 / 04:36 AM IST
మేమూ రె’ఢీ’ : కాంగ్రెస్ జాబితా సిద్ధం

అమరావతి: ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనా  పేర్లు  ప్రకటించకుండా  గోప్యత పాటిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండడంతో వారికి నచ్చచెప్పి అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో అభ్యర్థుల లిస్టుతో ఢిల్లీ వెళ్లి ఆమోదింపచేసుకొని.. ప్రచార బరిలోకి దిగేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ఏపీసీసీ నేతలు. 

ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక త్వరగా పూర్తిచేసి ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలంతా విజయవాడలో ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రచిస్తున్నారు. దాదాపు 1300 దరఖాస్తులను స్క్రూటినీ చేసి ఖరారు చేసిన ఫైనల్ జాబితాను గోప్యంగా ఉంచుతున్నారు. ఢిల్లీ వెళ్లి జాబితాకు ఆమోదముద్ర వేయించుకుని ప్రచార బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తర్వతిగతిన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచార హీట్‌ను పెంచనుంది. 

రాష్ట్రం విభజన అంశం వలన గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తెచ్చుకోని కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ మైనార్టీలు, ఎస్సీలతోపాటు మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారు. ప్రధానంగా నాలుగున్నరేళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడిన వారందరినీ గుర్తించి ఆయా నియోజకవర్గాల్లో పోటీకి దింపనున్నారు. తెలంగాణలో చేసిన తప్పులను ఏపీలో చేయకూడదని అన్నివర్గాల వారికి అవకాశమిచ్చారు. ఇక అభ్యర్థుల ప్రచారానికి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు ఏపీకి రానున్నారు. ప్రత్యేకహోదాతోపాటు ఏపీ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలకు వివరించనున్నారు. గత ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్‌  ఈసారి ఏపీ లో పుంజుకుంటుందా..? ఏపీ ప్రజలు హస్తం పార్టీని ఆదరిస్తారా..? లేక తిరస్కరిస్తారా..? అన్నది   మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది.