అంతా కారెక్కుతున్నారు, ఆ జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి

  • Published By: naveen ,Published On : November 7, 2020 / 05:38 PM IST
అంతా కారెక్కుతున్నారు, ఆ జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి

congress nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యంత బలహీనపడిందంటున్నారు. దీనికి కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడమేనని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే గ్రూపులకు కేరాఫ్‌ అడ్రస్‌ అనేలా ఉంటుంది. నిజామాబాద్‌ జిల్లా కూడా ఇందుకేమీ మినహాయింపు కాదు. పార్టీ నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించడంతో రాజకీయంగా పార్టీ వెనుకబడిపోతోందని కార్యకర్తలు అంటున్నారు.

జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరం:
జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ అంటూ ఒకటి ఉందన్న విషయాన్నే జనం మర్చిపోయేలా ఆ పార్టీ నేతలే చేజేతులా కొనితెచ్చుకుంటున్నారు. జిల్లాలో ఉన్న ఆ పార్టీ కార్యాలయానికి పూర్తిగా తాళాలు వేసుకునే పరిస్థితి ఎదురయ్యేలా ఉందని దిగువ స్థాయి కేడర్‌ ఆందోళన చెందుతోంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ పతనం తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కొనసాగింది. రోజు రోజుకి దిగజారుతున్న పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు అటు అధిష్టానం కూడా చేయకపోవడంపై కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారట.

సొంత అజెండాతో పని చేస్తున్న నేతలు:
పేరుకు చాలా మంది కాంగ్రెస్‌ నేతలున్నా.. తమకు పార్టీతో సంబంధం లేదన్నట్లు ముందుకు సాగుతున్నారని టాక్‌. కలసి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన వారంతా ఎవరికి వారు సొంత అజెండాతో పని చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టడం.. ఏదో నామ్‌కే వాస్తేగా అధికార టీఆర్ఎస్‌ పార్టీపై రెండు విమర్శలు చేయడం.. ఆ తర్వాత వదిలేయడం.. ఇలానే ఉంటోంది కాంగ్రెస్‌ నేతల వ్యవహారం. అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేళ్లవుతున్నా.. పార్టీని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టలేదని అంటున్నారు.

కలిసి పని చేయరు, అధిష్టానం పట్టించుకోదు:
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ గెలుచుకోలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితులు మారాయి. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మధు యాష్కికి 70వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి లోపాయికారిగా మద్దతిచ్చి పార్టీని కొందరు కాంగ్రెస్‌ నేతలే దెబ్బ తీశారని అంటున్నారు. ఆ తర్వాత పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అవే సీన్స్‌ రిపీట్‌ అయ్యాయి. ఇంత జరుగుతున్నా నాయకులు కలసి పని చేసేందుకు ప్రయత్నించడం లేదు. అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ఓటేసిన 40మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు:
తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. నామినేషన్ వేసిన సమయంలో కాంగ్రెస్‌కు 143 మంది సభ్యుల బలం ఉంది. ఆ ఓట్లు పోలై ఉంటే కనీసం డిపాజిట్ దక్కేది. కానీ పోలింగ్ నాటికి సీన్ అంతా రివర్స్ అయింది. వారి పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారు ఎక్కడమే కాకుండా ఉన్న వారు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేసుకోలేదు. 40మంది వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌కు ఓటు వేశారని చెబుతున్నారు. ఫలితంగా కేవలం 29 ఓట్లతో కాంగ్రెస్‌ సరిపెట్టుకుంది.

వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పూర్తిగా కనుమరుగు కాక తప్పదని ఆందోళన:
కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా చేతులెత్తేయడంతో కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మెల్లమెల్లగా ఒక్కొక్కరూ టీఆర్ఎస్‌ పార్టీలో చేరిపోతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన మధు యాష్కి గౌడ్ బొత్తిగా కనిపించడం మానేశారు. డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి కూడా పార్టీని పట్టించుకోవడం లేదంట. ఆయనకు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి పరిస్థితి మరింత దిగజారిపోయిందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సైలెంట్ అయిపోయారు. మాజీ ఎమ్మెల్యే అనిల్ ఎన్నికల సమయంలో మాత్రమే కనపడుతున్నారని చెబుతున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పూర్తిగా కనుమరుగు కాక తప్పదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

https://www.youtube.com/watch?v=j9Wm-Xpugk4