సీనియర్లంతా హైదరాబాద్‌కే పరిమితం, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయం‌, దిక్కుతోచక టీఆర్ఎస్‌లోకి పయనం

  • Published By: naveen ,Published On : September 6, 2020 / 12:20 PM IST
సీనియర్లంతా హైదరాబాద్‌కే పరిమితం, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయం‌, దిక్కుతోచక టీఆర్ఎస్‌లోకి పయనం

ఓ వైపు దూకుడుగా సాగుతున్న అధికార పార్టీ తీరు.. మరోవైపు వరుస వైఫల్యాలతో చేజారిన సొంత పార్టీ క్యాడర్.. ఇలాంటి సమయంలో కేడర్‌కు అందుబాటులో ఉంటూ.. వెన్నుదన్నుగా నిలవాల్సిన నేతలు మాత్రం రాజధానిలో మకాం పెట్టారు. ఇదీ ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితి. జిల్లాలో కాంగ్రెస్‌ సీనియర్లకు కొదవే లేదు. లెక్కకు చాలా మంది లీడర్లే ఉన్నా.. పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు మాత్రం ఎవరూ సిద్ధపడడం లేదు. విపక్ష పార్టీ ప్రతినిధులుగా అధికార వర్గాల్లో పెద్దగా గుర్తింపు లేక, తమ పనులు సాగక.. నిరాశలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా సీనియర్ నేతలు అందుబాటులో ఉండడం లేదట.

నిత్యం ఆధిపత్యం కోసం ఆరాటం:
పార్టీలో ఆధిపత్యం కోసం మాత్రం రచ్చకెక్కే నాయకులు… పార్టీలో స్థైర్యం నింపేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ద్వితీయ స్థాయి కేడర్ బాగా ఫీలవుతోంది. ఇదే అదనుగా చేసుకొని కాంగ్రెస్‌ కేడర్‌ను, ద్వితీయ శ్రేణి నాయకులను తమ పార్టీలోకి ఆకర్షిస్తోంది అధికార టీఆర్ఎస్‌ పార్టీ. అయినా కాంగ్రెస్‌ నేతల్లో వీసమెత్తు చలనం కూడా కనిపించడం లేదని కార్యకర్తలు మదనపడిపోతున్నారు.

కాంగ్రెస్ కంచుకోట అని గొప్పగా చెప్పుకొనేవారు:
ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే తమ కంచుకోట అని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకొనేవారు. రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపుతున్న నేతల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఎంపీగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఓ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ఒక్కరేమిటి చెప్పుకోవడానికి చాలా మందే ఉన్నారు. వీరంతా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే అయినా… రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలోనూ ముఖ్యనేతలుగా చలామణి అవుతున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ లోకి చేరికలు:
తాము లేకపోతే రాష్ట్రంలోనే కాంగ్రెస్‌ పార్టీ లేదన్నంతగా గొప్పలు పోయే నేతలున్నా… ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ కేడర్‌కు ప్రస్తుతం దిక్కులేని పరిస్థితి నెలకొంది. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న కాస్త కాంగ్రెస్‌ పార్టీ క్రమక్రమంగా ఖాళీ అవుతోంది. అందుకు ఇటీవల చేరికలే నిదర్శనాలు. ఇంకా చాలామంది టీఆర్‌ఎస్‌లో చేరేందుకు క్యూలో ఉన్నారని సమాచారం. ఆ పార్టీకి ఏకైక ఎమ్మెల్యే ఉన్న మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ టీఆర్‌ఎస్‌లో చేరింది. ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి తమకు అందుబాటులో ఉండడం లేదని… సీనియర్లను, ముఖ్యమైన కేడర్‌ను విస్మరిస్తున్నారని, ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు ప్రస్తుత పరిస్థితికి పొంతన లేదని కాంగ్రెస్‌ కేడరే ఆరోపిస్తోంది.

ఇక లాభం లేదని కాంగ్రెస్ ని వీడుతున్నారు:
ఇక ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మునుగోడు నియోజకవర్గానికి చుట్టపు చూపుగానైనా రావడం లేదని విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలపై దాదాపు ఏడాదిన్నరగా ఓపిక పట్టిన ద్వితీయశ్రేణి నేతలంతా ఇక లాభం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. ఇలాగే అభివృద్ధికి, ప్రజలకు దూరంగా కాంగ్రెస్‌లో ఉంటే తమ వ్యక్తిగత ప్రాభవాన్ని కోల్పోతామని భావిస్తున్న నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ వైపు తొంగిచూస్తున్నారట. ఇదే సమయంలో విపక్షంలోని అనైక్యతను తెలివిగా ఉపయోగించుకుంటుంది అధికార పార్టీ. ఇటీవల పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల, గ్రామస్థాయి ముఖ్యనేతలు చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.

తుంగుర్తిలోనూ సేమ్ సీన్:
తుంగుతుర్తి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరిపోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్‌రెడ్డి, యువనేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. దీంతో కేడర్‌ను పట్టించుకునేవారే కరువయ్యారు. నల్లగొండ నియోజవర్గంలోనూ కాంగ్రెస్‌ క్రమంగా ఖాళీ అవుతూ వస్తోంది. కనగల్‌ మండలానికి చెందిన మెజార్టీ నేతలు ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కసారి అయినా వచ్చిన దాఖలాలు లేవు. కేడర్‌కు అందుబాటులో లేని అగ్రనేతల తీరుపై తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది.

ఉత్తమ్.. కోదాడ, హుజూర్‌నగర్‌లకే పరిమితం:
టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేవలం కోదాడ, హుజూర్‌నగర్‌లకే పరిమితమవుతున్నారు. మిగతా నియోజకవర్గాలతో తనకు సంబంధం లేదన్న ధోరణితో ఉంటున్నారని కాంగ్రెస్‌ శ్రేణులే చెబుతున్నాయి. మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, అద్దంకి దయాకర్‌ లాంటి ముఖ్యులంతా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఉమ్మడి జిల్లాలో కీలక నేతలంతా హైదరాబాద్‌కు లేదంటే గాంధీభవన్‌ రాజకీయాలకే పరిమితం అవుతుండడంతో కేడర్‌లో తీవ్ర అసంతృప్తి, అయోమయం నెలకొంది.