రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

  • Published By: chvmurthy ,Published On : January 1, 2019 / 01:27 PM IST
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను3 విడతల్లో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలివిడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21 తో ముగుస్తుంది. 2వ విడత జనవరి 11న ప్రారంభమై25తో ముగుస్తుంది. 3వ విడత 16న ప్రారంభమై 30 తో ముగుస్తుంది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. 
మొదటి విడతలో 4,480 గ్రామ పంచాయతీలకు,రెండో విడతలో 4,137 గ్రామపంచాయతీలకు,తుది విడతలో 4,115 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్ ఉదయం 7 గంటలనుంచి 1 గంట వరకు  జరుగుతుంది. 2గంటలనుంచి కౌంటింగ్ మొదలై ఫలితాలు వెల్లడిస్తామని నాగిరెడ్డి చెప్పారు. ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో  నిర్వహిస్తామని, బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు. ఫలితాలు రోజే చేతులెత్తే పధ్దతిలో ఉప సర్పంచ్ ను ఎన్నుకుంటారని ఆయన తెలిపారు.  పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్రంలో మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. 
అన్నిరాజకీయ పార్టీలకు ఓటర్లు లిస్టులు అందచేస్తామని నాగిరెడ్డి చెపుతూ.. రాష్ట్రంలో మొత్తం పంచాయతీల సంఖ్య 12,732,వార్డులు 1,13,170 కాగా….. 1,49,52,508 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని అన్నారు.19 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడంలేదని, 15 గ్రామ పంచాయతీలకు ఇంకా సమయం ఉందని, మొత్తంగా 12,571 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని నాగిరెడ్డి తెలిపారు. 
సర్పంచ్ లుగా పోటీచేసే అభ్యర్ధులుజనరల్  కేటగిరీ లో 2వేలు, రిజర్వుడుకేటగిరీలో వెయ్యిరూపాయలు డిపాజిట్ గా చెల్లించాలి. వార్డు మెంబర్ జనరల్ కేటగిరిలో రూ.500,  రిజర్వుడు రూ.250 చొప్పున డిపాజిట్ చేయాలి. 5వేలు జనాభా దాటిన పంచాయతీల్లో అభ్యర్ధుల ఖర్చు రూ.2,50,000 మించి ఖర్చు  చేయరాదని, 5వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో  అభ్యర్ధి ఖర్చు రూ.1,50,000 లుగా నిర్ణయించినట్లు నాగిరెడ్డిచెప్పారు.