మాటల సమరం : మోడీ వర్సెస్ బాబు

  • Edited By: madhu , January 2, 2019 / 01:16 AM IST
మాటల సమరం : మోడీ వర్సెస్ బాబు

హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..ఏపీ సీఎం చంద్రబాబు మధ్య మాటల సమరం ప్రారంభమైంది. ఇప్పటికే కేంద్రంపై పలు విమర్శలు చేస్తున్న బాబు..మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఓ జాతీయ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ…బాబుపై పలు విమర్శలు చేశారు. ఈ విమర్శలకు బాబు కౌంటర్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు మోడీ, చంద్రబాబు మధ్య మాటలయుద్ధం మొదలైంది.  

బాబుది ఆక్రోశమన్న మోడీ….
మహాకూటమి విఫలమైందని, చంద్రబాబు ఆక్రోశంతో మాట్లాడుతున్నారంటూ…మోడీ విమర్శలు గుప్పించారు. దీనిపై బాబు ధీటుగా స్పందించారు. నాలుగున్నరేళ్లలో మోడీ పాలనలో ఏం లాభం జరిగింది ? దీనిపై చర్చకు సిద్ధమా అంటూ బాబు సవాల్ విసిరారు. కేంద్రం సాధించిన వృద్ధిరేటు ఏముంది ? నోట్ల రద్దు, జీఎస్టీతో మోడీ ఆర్థికాభివృద్ధి ఏం సాధించారు ? అంటూ ప్రశ్నలు గుప్పించారు. దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న బాబు…ఎవరి అభివృద్ధి విధానమేంటో దేశం ముందు ఉంచుదామని సవాల్‌ విసిరారు. ఏపీకి ఏమీ చేయకపోగా.. తనది ఆక్రోశమంటూ రాజకీయ నిందలేస్తారా అని నిలదీశారు. దేశాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్‌తో కలిశానని, చేతకాని నిర్వాకంతో మోడీ దేశాన్ని శిథిలం చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు.