అరకు ఎంపీ సీటుకు…. దేవ్‌డే దిక్కా..!

  • Published By: chvmurthy ,Published On : February 10, 2019 / 01:51 PM IST
అరకు ఎంపీ సీటుకు…. దేవ్‌డే దిక్కా..!

కిషోర్‌ చంద్రదేవ్‌ .. సీనియర్‌ పార్లమెంటేరియన్‌. రాజకుటుంబానికి చెందిన కిషోర్‌ హస్తానికి హ్యాండ్‌ ఇచ్చేశారు. ఇక తెలుగుదేశంలో చేరడమే తరువాయి. మరి కిషోర్‌ చంద్రదేవ్‌ సైకిలెక్కితే.. టీడీపీకి వచ్చే లాభమేంటీ.. ఉత్తరాంధ్ర అరకు టీడీపీకి ఆయనే దిక్కా.. వాచ్‌ దిస్‌ స్టోరీ. 

కిషోర్‌ చంద్రదేవ్‌.. కురుపాం రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. పార్లమెంటేరియన్‌గా 30 ఏళ్ళ అనుభవం. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ తొలి ఎంపీగానూ.. అంతకు ముందు పార్వతీపురం ఎంపీగానూ పనిచేశారు. 1977లో మొదటి సారి ఎంపీగా గెలిచిన నాటి నుంచి 5 సార్లు లోక్‌సభకు, ఒక సారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2009లో అరకు నుంచి విజయం సాధించిన తరువాత కిషోర్ చంద్రదేవ్ .. మైన్స్, స్టీల్, కోల్ మంత్రిగా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకూ గిరిజన శాఖ మంత్రిగా, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 

ముక్కు సూటి మనిషిగా పేరున్న కిషోర్ చంద్రదేవ్ గతంలో సొంత పార్టీ నిర్ణయాలను కూడా వ్యతిరేకించారు. ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాలను అప్పటి కేంద్ర మంత్రి మండలి సమర్ధించగా,  ఈయన విభేదించారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా ఉన్న కిషోర్ చంద్రదేవ్‌పై  ఒక్క అరోపణ కానీ విమర్శకాని లేదు. ఒకసారి ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు కూడా అందుకున్నారు. అలాంటి కిషోర్ చంద్రదేవ్ 2014 ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ నుంచి అరకు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారనే చెప్పాలి. 

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా .. కాంగ్రెస్ పార్టీ జాతీయ అదివాసీ అధ్యక్షుడిగా కిషోర్‌ చంద్రదేవ్‌  కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేకుండా పోతోందని అవేదన వ్యక్తం చేస్తూ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపీ ఓటమికి ప్రయత్నిస్తానని చెప్పటం ద్వారా ఆయన భవిష్యత్‌లో రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పకనే చెప్పారు. ఈ సమయంలో కిషోర్ చంద్రదేవ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది అసక్తికరంగా మారింది.

2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో గిరిజన నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రధానంగా విశాఖ పార్లమెంట్ స్థానంతో పాటు అరకు, పాడేరు నియోజకవర్గాల్లో  కూడా  వైసీపీ విజయం సాధించింది. ఒకప్పుడు అరకు నియోజక వర్గం టీడీపీకి కంచుకోటగా ఉన్నా 2014 ఎన్నికల్లో కిడారి సర్వేశ్వరరావు అరకు నుంచి వైసీపీ ఎమ్మేల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత పాడేరు నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరీతో పాటుగా కిడారి సర్వేశ్వరావు కూడా టీడీపీలోకి వచ్చారు. అయితే అరకు, పాడేరు ఎమ్మేల్యేలు టీడీపీలో చేరినా ఆ పార్టీ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసే సమర్ధవంతమైన నాయకుడు ఎవరూ లేరు. ప్రస్తుతం జీసీసీ ఎండీగా పనిచేస్తున్న బాబురావు నాయుడిని బరిలో దింపే అలోచన చేసినా  కిషోర్ చంద్రదేవ్ వంటి నేతలు పార్టీలో ఉండటం వల్ల అరకు పార్లమెంటరీ సీటును ఈజీగా గెలుపొందాలని టీడీపీ పెద్దల అలోచనగా తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే  అయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. 

కిషోర్ చంద్రదేవ్ ఒక వేళ టీడీపీలో చేరితే ఏజన్సీ ప్రాంతంలో ఆయనకు ఉన్న ఇమేజ్ టీడీపీకి వరంగా మారుతుందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్రలోని రాజకుటుంబాల్లో తొలి నుంచి విజయనగరం రాజులు టీడీపీలో ఉండగా  మిగిలిన కుటుంబాలన్నీ టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో ఉండేవి. అయితే విభజన అనంతరం రాష్ట్రంలో  తిరిగి కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపోవడంతో  శత్రుచర్ల,  బొబ్బిలి కుటుంబాలు కూడా టీడీపీలో చేరాయి. ఇక మిగిలినది కురుపాం రాజకుటుంబం మాత్రమే. కిషోర్‌ చంద్రదేవ్‌ కూడా టీడీపీ గూటికి చేరితే ఆలోటూ తీరిపోతుంది.

కిషోర్‌ చంద్రదేవ్‌ బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకం. కానీ ఇంతవరకూ టీడీపీ బాక్సైట్ అనుకూలమో కాదో చెప్పలేదు. బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకం అంటూనే తవ్వాలకు ఇచ్చిన జీవోని టీడీపీ ఇంకా రద్దు చెయ్యలేదు. దీంతో టీడీపీని నమ్మే పరిస్థితుల్లో గిరిజనులు లేరు. ఇలాంటి పరిస్ధితుల్లో కిషోర్‌ చంద్రదేవ్‌ టీడీపీ గూటికి చేరతారా, టీడీపీ బాక్సైట్‌ తవ్వకాలపై జీవో రద్దు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.