జగన్ కు కొత్త తలనొప్పి: అనంత వైసీపీలో అసమ్మతి

  • Published By: chvmurthy ,Published On : January 25, 2019 / 01:40 PM IST
జగన్ కు కొత్త తలనొప్పి: అనంత వైసీపీలో అసమ్మతి

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ లో అసమ్మతి ఒక్కటోక్కటిగా బయట పడుతోంది.  ఇటీవలే విజయవాడలో వంగవీటి రాధా పార్టీని వీడి అధ్యక్షుడు  జగన్ పై  సంచలన ఆరోపణలు చేయటం చర్చనీయాంశం కాగా….  మరోవైపు రాయలసీమలోని  అనంతపురం  జిల్లా వైసీపీలోనూ  అసమ్మతి రాగాలు తారాస్థాయికి చేరాయి.  పార్టీ అధ్యక్షుడు జగన్ అభ్యర్థులను ప్రకటించిన హిందూపురం, కదిరి  రెండు  అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ నేతలు జగన్ పై కోపంతో రగిలిపోతున్నారు. జగన్ ప్రవర్తనతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు కొత్త టెన్షన్ మొదలైంది. దీంతో టికెట్ ఆశిస్తున్న ఆశావహ అభ్యర్థులు లాబీయింగ్ మొదలు పెట్టారు.
టీడీపీకి పట్టున్న అనంతపురం
రాయలసీమలోని అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 12 స్థానాల్లో విజయం సాధిస్తే రెండు చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. కొంత కాలానికి కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్‌బాషా…టీడీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలాడు. దీన్ని బట్టే చెప్పవచ్చు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న జిల్లా అని. జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించిన ఎంపీ మిథున్‌ రెడ్డి  పార్టీ  నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక చేసేలా నాయకులతో చర్చించారు. అభ్యర్థుల ఎంపికపై గొడవలున్న నియోజకవర్గాల్లో…అభ్యర్థుల జాబితాను తయారు చేసి జగన్‌కు పంపినట్లు తెలుస్తోంది.
హిందూపురం వైసీపీలో చిచ్చు
హిందూపురంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ నవీన్‌ నిశ్చల్ వైసీపీకి అన్నీ తానై వ్యవహరించారు. ఆరేళ్ల పాటు పార్టీని ముందుండి నడిపించారు. టికెట్ తనకే అనుకున్న నిశ్చల్‌కు జగన్‌ ఝలక్ ఇచ్చారు. ఇటీవల వైసీపీలో చేరిన మాజీ టీడీపీ ఎమ్మెల్యే అబ్ధుల్ ఘనికి…నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. తర్వాత టికెట్‌ కూడా ఆయనకే ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నవీన్ వర్గీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీని వీడేందుకు డిసైడయిన నవీన్ నిశ్చల్….ఇటీవల టీడీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లారు. టీడీపీ నేతలతో కలిసి సీఎం చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సైకిలెక్కుతారన్నవార్తలు నియోజక వర్గంలో జోరుగా సాగుతున్నాయి. 
కదిరిలోనూ అదే అసంతృప్తి
మరోవైపు కదిరి నియోజకవర్గంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే. టికెట్ వస్తుందన్న ఆశతో….వజ్ర భాస్కరరెడ్డి భారీగా ఖర్చు చేశారు. అన్ని సర్వేలు భాస్కరరెడ్డికి అనుకూలంగా వచ్చాయి. అయితే ఉన్నట్టుండి పార్టీ అధినేత జగన్….సిద్ధారెడ్డికి టికెట్ కేటాయించారు. కొత్త వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ…వజ్ర భాస్కర రెడ్డి రగిలిపోతున్నారు. తనకు కాదని…సర్వేల్లో మూడో స్థానంలో ఉన్న వ్యక్తికి టికెట్ కేటాయించడంతో…ప్రెస్‌మీట్ పెట్టి తన ఆవేదన వెళ్లగక్కారు. జగన్‌ మీద నమ్మకం లేదన్న వజ్రభాస్కర రెడ్డి….టికెట్ తనకు కేటాయించకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ…అసంతృప్తి సెగలు తారాస్థాయికి చేరడంతో పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి రేపుతోంది. అసంతృప్తులను బుజ్జగించి…దారిలోకి తెచ్చుకుంటారా ? లేదంటే అభ్యర్థులను మారుస్తారా అన్నది తేలాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.