దుబ్బాక రాజకీయాల్లో అనూహ్య మార్పులు.. 2వేల మందితో టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ కీలక నేతలు

  • Published By: naveen ,Published On : October 9, 2020 / 02:51 PM IST
దుబ్బాక రాజకీయాల్లో అనూహ్య మార్పులు.. 2వేల మందితో టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ కీలక నేతలు

dubbaka bypolls: దుబ్బాకలో రోజురోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయ్. ప్రధాన పార్టీల నాయకులు.. అందులో నుంచి ఇందులోకి.. ఇందులో నుంచి అందులోకి జంప్ అవుతున్నారు. మొన్నటికి మొన్న.. చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ కూడా కన్ఫాం చేసేసింది.

దీంతో.. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్లు.. ఇప్పుడు టీఆర్ఎస్‌లోకి జంప్ అవుతున్నారు. నర్సింహారెడ్డి, మనోహర్ రావు.. . మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటున్నారు. 2 వేల మంది అనుచరులతో.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి జాయిన్ అయ్యారు.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ పరిణామం గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. టికెట్‌ ఆశించి భంగపడ్డ సీనియర్‌ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్‌రావు పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్‌ఎస్‌ నేత సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టులో మరణించిన విషయం విదితమే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

నవంబర్ 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేర్లను ఆయా పార్టీలు ప్రకటించడంతో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించి నిరాశకు గురైన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. దుబ్బాక బీజేపీలోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. రఘునందన్‌రావుకు టికెట్‌ కేటాయించడం పట్ల తోట కమలాకర్‌రెడ్డి విమర్శలు చేయగా, పార్టీ ఆయనను బహిష్కరించింది. నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల సందడి ఊపందుకుంది.

షెడ్యూల్‌ వివరాలు:
నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9
నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17
ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19
పోలింగ్ తేదీ : నవంబర్ 3
కౌంటింగ్ తేదీ : నవంబర్ 10