నాలుగు కుర్చీలాట.. టీ-బీజేపీలో గ్రూపు పాలిటిక్స్!

  • Published By: sreehari ,Published On : January 3, 2020 / 07:39 AM IST
నాలుగు కుర్చీలాట.. టీ-బీజేపీలో గ్రూపు పాలిటిక్స్!

బీజేపీ అంటే ఓ జాతీయ పార్టీ… క్రమశిక్షణకు మారుపేరులా చెప్పుకొనే పార్టీ. అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యం అనుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే నాయకులు అంతా కట్టుబడి ఉంటారనే భావన కూడా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల్లాగే బీజేపీలోనూ గ్రూపులున్నాయని అంటున్నారు. ఎవరి గ్రూప్ వారిదే. ఎవరి రాజకీయం వారిదేనని అనుకుంటున్నారు పార్టీలోని సామాన్య కార్యకర్తలు. పైకి మాత్రం తామంతా ఒక్కటే అనేలా కనిపిస్తారంట కమలనాథులు. ఇదంతా పార్టీలో అంతర్గత విషయాలు తెలిసిన వారికి, కాస్త దగ్గరగా పరిశీలన చేసేత వారికే తెలిసే విషయం అంటున్నారు.

ఒక్కో నేతదీ ఒక్కో గ్రూప్ :
నేతల మనసులోని మాటలు బయటపడితేనే ఇవి పూర్తిగా అర్థమవుతాయట. పార్టీ మాటే శిరోధార్యం అనే వారు కూడా పార్టీలో ఉన్నారు. అలానే పార్టీ నిర్ణయంతో తమకు సంబంధం లేదనే వారు కూడా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీని దగ్గరగా పరిశీలిస్తే అందులో ఉన్న ఒక్కొక్క ముఖ్య నేతదీ ఒక్కో గ్రూప్ అంటున్నారు. అధ్యక్షుడు లక్ష్మణ్‌ది ఒక గ్రూప్ ఐతే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిది మరో గ్రూప్. జాతీయ ప్రధాన కార్యదర్శిది మరో బ్యాచ్. వీరితోపాటు కొత్తగా వచ్చిన రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావు, డీకే అరుణ కూడా వారి వారి గ్రూపులు నడిపిస్తున్నారట.

పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పి, అంతే కమిటిమెంట్ ఉండే ఇంద్రసేనరెడ్డి లాంటి వారు.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సంబంధం లేదనుకొని, తానేది అనుకుంటే అదే చేస్తానని అనే ఎమ్మెల్యే రాజసింగ్‌లుకూడా పార్టీలో ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గ్రూపులో ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఎన్‌వీ సుభాష్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భరత్ గౌడ్ రాగ, కిషన్‌రెడ్డి వెనక మాజీ ఎమ్మెల్యే రామచందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి లాంటి రెడ్డి నేతలు ఉన్నారట. ఇక మురళీధర్ రావుతో కృష్ణ సాగర్, కరుణ గోపాల్ లాంటి వాళ్లుండగా, గరికపాటి వెంట టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన బ్యాచ్ ఉన్నారట.

గ్రూపు రాజకీయాల వల్లే :
అధ్యక్ష రేసులో ముందున్న డీకే అరుణ సైతం ఎన్నాం శ్రీనివాస్ లాంటి వాళ్లతో గ్రూపులు నడిపిస్తున్నారని పార్టీలోనే అనుకుంటున్నారు. ఇలాంటి గ్రూప్ రాజకీయాల వల్లే బీజేపీ ఒక అడుగు ముందుకేస్తే.. నాలుగు అడుగులు వెనక్కు వేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇన్ని గ్రూపులు పెట్టుకొని పైకి మాత్రం అంతా ఒకటే అన్నట్టుగా బిల్డప్పులివ్వడం బీజేపీకే చెల్లిందంటున్నారు. అంతేనా.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకోవడం విడ్డూరంగానే ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో జాతీయ నాయకత్వం కలుగజేసుకోకపోతే ప్రత్యామ్నాయం కాదు కదా.. పత్తా లేకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు కార్యకర్తలు.

గ్రూపుల వెనుక రీజన్ ఇదేనా? :
తెలంగాణ బీజేపీ నేతల గ్రూపుల వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు జనాలు. హైకమాండ్‌లో ఈ నేతలకు ఉన్న డీలింగ్స్‌, అక్కడి పెద్ద నేతల కారణంగానే ఇక్కడ కూడా వీరు ఇలా వ్యవహరిస్తున్నారట. తెలంగాణకు చెందిన ఒక్కో నాయకుడికి పైన ఒక్కొక్కరి అండ ఉందని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. కిషన్‌రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, లక్ష్మణ్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, డీకే అరుణకు ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌, గరికపాటి మోహన్‌రావుకు హైకమాండ్‌ దగ్గర పట్టున్న సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ ఉన్నారని చెబుతున్నారు. వీరి అండదండలు చూసుకొనే ఇక్కడ నేతలు గ్రూపులు కడుతున్నారని అనుకుంటున్నారు.