సొంత పార్టీనే పట్టించుకోవడం మానేసిన మాజీ ఎంపీ

  • Edited By: sreehari , February 5, 2020 / 02:10 PM IST
సొంత పార్టీనే పట్టించుకోవడం మానేసిన మాజీ ఎంపీ

ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉన్న సమయంలో మధు యాస్కీ గౌడ్‌ను రెండుసార్లు ఎంపీగా గెలిపించారు ప్రజలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తనకు సంబంధాలు ఉన్నాయని ఊదరగొట్టే ఆయన సడన్‌గా కనిపించడం మానేశారు. పార్టీ మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు పదవులతో ఎంజాయ్‌ చేసిన ఆయన.. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంటే మాత్రం కనీసం అటు వైపు చూడటం లేదని పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికి లేకుండాపోతున్న సమయంలో అండగా ఉండాల్సిన ఆయన అసలు రావడం లేదంటూ చర్చించుకుంటున్నారు. 

ఇందూరు వేదికగా కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది రాజకీయ అరంగేట్రం చేసి పెద్ద నేతలుగా ఎదిగారు. ఈ గొడుకు కింద అనేక పదవులు స్వీకరించి, ప్రజాసేవకు అవకాశాలు అందిపుచ్చుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితిలో అందరూ దూరమైపోవడంతో కేడర్‌ ఆందోళన చెందుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదలైన పార్టీ పతనం మున్సిపల్ ఎన్నికల సమయానికి ఇంకా దారుణంగా తయారైంది. నాయకులు ఒక్కొక్కరుగా పక్కదారి పట్టడం, ఉన్నవారు పార్టీని పట్టీంచుకోకుండా హైదరాబాద్, ఢిల్లీకి పరిమితం కావటం పార్టీని మరింత కుంగదీసింది. కార్యకర్తలు తలో దిక్కు చెదరిపోయారు. 

మున్సిపల్ ఎన్నికల్లోనూ : 
ఇందూరు కాంగ్రెస్ పార్టీకి తానే పెద్ద దిక్కు అని చెప్పుకుంటూ వస్తున్న మాజీ ఎంపీ మదు యాష్కి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ముఖం చాటేశారు. టికెట్ల కేటాయింపు సమయంలో మాత్రమే రహస్యంగా సమావేశాన్ని నిర్వహించి, పంచాయితీలు సెట్‌ చేసేసి వెళ్లిపోయారట. ఆ తర్వాత పోలింగ్ రోజు వచ్చి ఓటేసి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. ప్రచార సమయంలో కనీసం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి ఎంపీ కవితను ఓడించేందుకు బీజేపీకి సహకరించారనే టాక్‌ వినిపించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనకు తెలుసునని గొప్పలు చెప్పుకొనే ఆయన పార్టీని మాత్రం పూర్తిగా పట్టించుకోవడం మానేశారని కార్యకర్తలు గుసగుసలు ఆడుకుంటున్నారు. 

పార్టీ తరఫున కర్ణాటక ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇచ్చారని, ఏఐసీసీ కార్యదర్శిగా చెప్పుకొంటున్న మధు యాష్కి… ఢిల్లీ రాజకీయాలకే పరిమితమైపోయారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లకు 58 డివిజన్లలో అభ్యర్థులను దించిన కాంగ్రెస్‌.. రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న పార్టీ ఇప్పుడు వెన్నెముక లేని నాయకులతో కుదేలైపోయింది. కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం పార్టీని బతికించుకునే వ్యూహాలు చేయకుండా బీజేపీకి మేయర్ పీఠం దక్కేలా చేయడంలో తెర వెనుక పొత్తులకు ప్రయత్నించిందనే టాక్‌ నడిచింది. మధు యాష్కి కారణంగానే పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని కార్యకర్తలు లోలోపల బాధ పడిపోతున్నారట.