నగరి టికెట్‌ ’గాలి’ కుటుంబానికే దక్కుతుందా ? 

గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుల వ్యవహారశైలితో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

  • Published By: veegamteam ,Published On : February 11, 2019 / 01:38 PM IST
నగరి టికెట్‌ ’గాలి’ కుటుంబానికే దక్కుతుందా ? 

గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుల వ్యవహారశైలితో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

చిత్తూరు : ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో….ఆ పార్టీదే పై చేయి. నియోజకవర్గానికి సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా పని చేసిన నేత కాస్తా మృతి చెందడంతో పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారాయి. ఆ సీటు కోసం ఇద్దరు కుమారులు పోటీ పడుతున్నారు. నాదంటే.. నాదని రోడ్డుకెక్కారు. ఇలా గత ఆరు నెలల నుంచి రోడ్డు మీదే ఉన్నారు. అధినేతకు చికాకు పుట్టిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం….టీడీపీకి పెట్టని కోటలాంటిది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతి చెందడంతో….నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. కంచుకోటకు బీటలు వారేలా గాలి తనయులు వ్యవహరిస్తున్నారు. పార్టీతోపాటు…కుటుంబ పరువును తీసుకుంటున్నారు. నగరిలో జరుగుతున్న పరిణామాలు….చంద్రబాబుకు పంటికింద రాయిలా తయారయ్యాయి. పార్టీకి కంచుకోటలా ఉన్న నగరిని…మళ్లీ గుప్పెట్లోకి తెచ్చుకోవడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. తల్లి సరస్వతమ్మతో కలిసి పెద్ద కుమారుడు జగదీష్ ఒకవైపు ప్రచారం చేస్తుంటే…మరో వైపు చిన్న కుమారుడు భాను ప్రకాశ్‌ ఒంటరిగా ప్రజల్లోకి వెళ్తున్నారు. గాలి కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ కొలిక్కి రాక అధినేత తల పట్టుకుంటున్నారు. 

గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుల వ్యవహారశైలితో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముద్దుకృష్ణమ వారసుడు ఎవరో తెలియక….నేతలు, ప్రజలు సందిగ్దంలో పడ్డారు. ఇద్దరు కొడుకులు జగదీష్, భానుప్రకాశ్‌లు…వారసుడు తానంటే…తానంటున్నారు. సోదరుల మధ్య గొడవతో సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి….తల్లి గాలి సరస్వతమ్మకు కట్టబెట్టారు. ఆ తర్వాతైనా వివాదం సద్ధుమణుగుతుందనకుంటే….అదీ జరగలేదు. పెద్దకొడుకు జగదీష్‌ కాస్త పట్టు విడుపులకు వెళుతున్నా….చిన్న కుమారుడు భానుప్రకాశ్‌ మాత్రం టికెట్ కావాల్సిదేనంటూ మొండి పట్టుదలకు పోతున్నారు. తనకు పార్టీ టికెట్‌ ఇవ్వకపోయినా….నగరి నుంచి పోటీ చేసి తీరుతానంటున్నాడు. దీంతో నగరి అభ్యర్థి ఎంపిక వ్యవహారం చంద్రబాబుకు చికాకు పుట్టిస్తోంది. జగదీష్‌, భానుప్రకాశ్‌లను చంద్రబాబు హెచ్చరించినా…ఇద్దరిలో మార్పు మాత్రం రాలేదు. 

కుటుంబ సమస్య ఇప్పట్లో తేలదని నిర్దారణకు వచ్చిన చంద్రబాబు….కొత్త వ్యక్తిని బరిలోకి దించాలని భావిస్తున్నట్లు సమచారం. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజా…మరోసారి బరిలోకి దిగి నగరి సీటును మళ్లీ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. రోజా మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా….చేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే రోజాను సమర్థవంతంగా ఢీ కొట్టే అభ్యర్థి ఎంపిక చంద్రబాబుకు కష్టంగా మారింది. టీడీపీ నుంచి సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల అధినేత అశోక్‌రాజు నగరి టికెట్ ఆశిస్తున్నారు. ఆర్థికంగా అశోక్‌రాజు స్థితి మంతుడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయి. అశోక్‌రాజును నగరి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  జగదీష్, భానుప్రకాశ్‌, అశోక్‌రాజు పేర్లతో ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయం తీసుకున్నారు. 

కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై ఫైరవుతున్న రోజాను రాజకీయంగా కట్టడి చేసేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు సీఎం చంద్రబాబు. నగరి టికెట్‌ గాలి కుటుంబానికే దక్కుతుందా ? లేదంటే మరో వ్యక్తిని చంద్రబాబు బరిలో దించుతారా అన్న విషయం తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.