అవంతి వర్సెస్ గంటా : భీమిలి కోసం పోటాపోటీ

విశాఖ: రాజకీయాల్లో ఆయనది విలక్షణ శైలి. గడిచిన మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీల నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన నియోజకవర్గంలో తిరిగి పోటీ చెయ్యని ఆ నేత ఇంత

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 01:39 PM IST
అవంతి వర్సెస్ గంటా : భీమిలి కోసం పోటాపోటీ

విశాఖ: రాజకీయాల్లో ఆయనది విలక్షణ శైలి. గడిచిన మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీల నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన నియోజకవర్గంలో తిరిగి పోటీ చెయ్యని ఆ నేత ఇంత

విశాఖ: రాజకీయాల్లో ఆయనది విలక్షణ శైలి. గడిచిన మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీల నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన నియోజకవర్గంలో తిరిగి పోటీ చెయ్యని ఆ నేత ఇంత వరకూ ఓటమి ఎరుగడు. అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండే ఈ పవర్ హౌస్.. ఈ సారి ఏ నియోజక వర్గం నుంచి పోటీ చెస్తారనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అనవాయితీగా ఈ ఎన్నికలకు కూడా మరో నియోజక వర్గం ఎంచుకుంటారా .. లేక ప్రాతినిధ్యం వహిస్తున్న చోట నుంచే బరిలో ఉంటారా..? ఇంతకీ ఆ విలక్షణ నేత ఎవరు..

 

గంటా శ్రీనివాసరావు.. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గంటాకు పోలిటికల్ బిజినెస్ మెన్‌గా పేరుంది. అధికారం ఎక్కడ ఉంటే ఈయన అక్కడ ఉంటారనే విమర్శ కూడా ఉంది. రాజకీయాల్లో అరంగ్రేటం నుంచి ఇంతవరకూ ఓటమి ఎరుగని ఈ పవర్ హౌస్.. ఒకసారి పోటీ చెసిన నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చెయ్యలేదు.

 

1999లో తొలిసారి అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి గంటా ఎంపీగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మేల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి హేమా హేమీలైన దాడి వీరభద్రరావును, కొణతాల రామకృష్ణను ఓడించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజనతో టీడీపీలో జాయిన్ అయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున భీమిలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం మానవ వనరుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గంటా తిరిగి ఎక్కడ నుంచి పోటీ చేస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా ప్రకటించారు. అయితే అవంతి శ్రీనివాస్ కూడా బీమిలి నుంచే పోటీ చెయ్యడానికి ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు కూడా వచ్చాయని సమాచారం. టీడీపీ అధిష్టానం నుంచి కూడా సానుకూల వాతావరణం లేకపోవడంతో గంటా అలకపూనారని అంటారు. దీంతో జిల్లా ఇన్‌చార్జ్‌ మినిస్టర్ చినరాజప్ప రాయబారాలు నడిపారట. ఆ వివాదం చల్లబడిందనుకున్నా అవంతి శ్రీనివాస్ మాత్రం తాను బీమిలి నుంచే పోటీ చెస్తానని.. బీమిలి సీటివ్వకపోతే వేరే పార్టీ నుంచైనా బీమిలి నుంచే పోటీ చెస్తానని టీడీపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా గెలిచే సీటును పోగొట్టుకోవడం ఇష్టం లేని అధిష్టానం అవంతి శ్రీనివాసరావుకే సీటు కేటాయిస్తున్నట్లు సూచాయగా తెలిపిందని సమాచారం. దీంతో గంటా చూపు వేరే నియోజకవర్గాల మీద పడినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

 

తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న అనకాపల్లి నుంచి గాని, గాజువాక నియోజక వర్గం నుంచి కాని మొదట పోటీ చెయ్యాలని గంటా భావించినా.. అనకాపల్లిలో గంటా తోడల్లుడు పరుచూరి భాస్కరరావు కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్యడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇదే సమయంలో టీడీపీలోకి కొణతాల రామకృష్ణ వచ్చే అవకాశం ఉందని .. ఆయన కోసం ఆ సీటును అట్టిపెట్టాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అటు గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను కాదనే పరిస్తితీ లేదు. దీంతో గంటా ఈ సారి ఏకంగా జిల్లాను మార్చే అలోచన ఉన్నట్లుగా కనిపిస్తోంది.

 

విజయనగరం జిల్లాకు గంటా శ్రీనివాసరావు ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి.. గంటా అలోచన ఏ విదంగా ఉందో.