ఏపీ ఉద్యోగులకు శుభవార్త : 20 శాతం ఐఆర్ కు సీఎం అంగీకారం

  • Published By: chvmurthy ,Published On : February 8, 2019 / 02:56 PM IST
ఏపీ ఉద్యోగులకు శుభవార్త : 20 శాతం ఐఆర్ కు సీఎం అంగీకారం

అమరావతి: ఏపీ లోని ప్రభుత్వ ఉద్యోగులకు  రాష్ట్ర  ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై అశితోష్‌ మిశ్రా నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ సంఘాలు  40 నుంచి 45 శాతం వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపిన చర్చల అనంతరం  20 శాతం ఐఆర్‌ ఇచ్చేందుకు సీఎం అంగీకారించారు.

దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్బంగా ఉద్యోగ సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడుతూ …రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులున్నప్పటికీ  ప్రభుత్వం ఇచ్చింది సంతోషంగా తీసుకోవాలని సీఎం సూచించారని తెలిపారు.  దానికి తాముకూడా సంతోషంగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల తరుఫున చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ పూర్తి సహకారం అందిస్తామని  చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 11 న ఢిల్లీలో చంద్రబాబు తలపెట్టిన దీక్షకు మద్దతుగా అన్ని ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లి మద్దతు తెలుపుతామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.