ఎల్బీనగర్‌లో టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్.. ఇలానే వదిలేస్తే బల్దియా ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదు

  • Published By: naveen ,Published On : October 27, 2020 / 05:26 PM IST
ఎల్బీనగర్‌లో టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్.. ఇలానే వదిలేస్తే బల్దియా ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదు

lb nagar trs : రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ప్రస్తుత టీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఇన్‌చార్జ్ రామ్మోహన్ గౌడ్ తొలుత కాంగ్రెస్ పార్టీలో ఓనమాలు దిద్దినవారే. నియోజకవర్గంలో అన్నదమ్ముల్లా కలసి పని చేసినవారే. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా సుధీర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ గతంలో కొనసాగిన వారే. అదే సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు రావడం, 2014లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రామ్మోహన్ గౌడ్ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య చేతిలో ఓడిపోగా, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సుధీర్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.

రామ్మోహన్‌ గౌడ్‌ కనపడకుండా చేయడమే లక్ష్యం:
కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చిందని అంటున్నారు. టీఆర్ఎస్‌లో ఇద్దరు నేతలు ఇప్పుడు ఉండడంతో వర్గపోరు తీవ్రమైందంటున్నారు. ఒకరికొకరు ఎదురు పడినా పలకరించుకోవడం లేదని టాక్‌. రామ్మోహన్‌గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్న నాటి నుంచి మళ్లీ విభేదాలు మొదలయ్యాయని అంటున్నారు. ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాల్లో వీరిద్దరు అంటీముట్టనట్లు వ్యహరిస్తున్న తీరుతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో రామ్మోహన్‌ గౌడ్‌ను కనపడకుండా చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పని చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

కార్పొరేటర్లతో సైతం రామ్మోహన్‌కు విభేదాలు:
రామ్మోహన్ గౌడ్ పేరుకే నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయినా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఏమీ ఉండటం లేదనేది ఆయన వర్గీయుల వాదన. కార్పొరేటర్లతో సైతం ఆయనకు విభేదాలున్నాయి. హయత్ నగర్ కార్పొరేటర్ తిరుమల్ రెడ్డికి రామ్మోహన్‌కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటికి వచ్చింది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తనకు చెప్పకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ఏంటంటూ తిరుమల్ రెడ్డిపై రామ్మోహన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామ్మోహన్‌ భార్యకు ఈసారి టికెట్‌ అనుమానమే:
మరోవైపు రామ్మోహన్ గాడ్ ఫాదర్‌గా ఉన్న మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి అనారోగ్యం కారణంగా పార్టీలో యాక్టివ్‌గా లేరు. దీంతో రామ్మోహన్‌కు పార్టీ పెద్దల నుంచి మద్దతు లేకుండా పోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్‌గా రామ్మోహన్ గౌడ్ సతీమణి లక్ష్మీప్రసన్న ఉన్నా తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి రాంమోహన్ గౌడ్ భార్యకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు. సుధీర్‌రెడ్డి సన్నిహితుడికి ఈసారి కార్పొరేటర్ టికెట్‌ ఇచ్చే చాన్స్‌ ఉందని చెబుతున్నారు.

అధిష్టానానికి తలనొప్పిగా మారిన నేతల ఆధిపత్య పోరు:
తన భార్యకే టికెట్ ఇప్పించుకోలేని పరిస్థితుల్లో రామ్మోహన్‌ ఉన్నారని, ఆయనను ఆత్మరక్షణలో పడేయడమే ప్రత్యర్థుల వ్యూహంగా ఉందంటున్నారు. ఇదే జరిగితే ఆయన టీఆర్ఎస్‌లో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా పని చేసే అవకాశాలున్నాయని సన్నిహితులు అంచనా వేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారింది. దీని వల్ల గ్రేటర్ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పేలా లేవని భావిస్తున్నారు. అధిష్టానం ఇప్పటికయినా కలుగజేసుకొని విభేదాలు సెటిల్ చేయకపోతే బల్దియా ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదు అంటున్నారు.

https://www.youtube.com/watch?v=5sv9a8CLWv4