అటు సమత..ఇటు హజీపూర్ : తుది తీర్పు వాయిదా

  • Published By: madhu ,Published On : January 27, 2020 / 06:31 AM IST
అటు సమత..ఇటు హజీపూర్ : తుది తీర్పు వాయిదా

సమత హత్యాచారం, హజీపూర్ హత్యల కేసుల్లో తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఎలాంటి తీర్పు వస్తుందోనని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించడంతో నిరుత్సాహం చెందారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హజీపూర్‌కు చెందిన ముగ్గురు అమ్మాయిలపై వేర్వేరు ఘటనలో శ్రీనివాసరెడ్డి అత్యాచారానికి పాల్పడి హతమార్చాడని పోలీసులు నల్గొండ న్యాయస్థానంలో అభియోగాలు మోపారు.

అలాగే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో గత సంవత్సరం నవంబర్ 24న ఓ వివాహితపై (సమత) షేక్ బాబు, షేక్ షాబూద్దీన్, షేక్ మగ్దూం అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేశారని ఆదిలాబాద్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నాలుగు హత్యాచార ఘటనలకు సంబంధించిన తీర్పులను రెండు న్యాయస్థానాలు 2020, జనవరి 27వ తేదీ సోమవారానికి వాయిదా వేశాయి. 

కానీ…సమత కేసు వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా న్యాయమూర్తి సెలవుపై వెళ్లారని అందుకే తుది తీర్పును జనవరి 30వ తేదీన వెల్లడించనున్నట్లు న్యాయవాదులు వెల్లడించారు. ఈ కేసు విచారణకు డిసెంబర్ 11వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. తుది తీర్పు వెలువడాల్సి ఉండగా..న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో వాయిదా పడింది. 

దిశ ఘటన జరిగిన సమయంలో సమత అత్యాచారాని గురైంది. 
ముగ్గురు నిందితులు ఆమెపై అత్యాచారం జరిపి… ఆపై గొంతుకోసి హత్య చేశారు.
మరుసటి రోజు ఈ హత్యోదంతం బయటకు వచ్చింది.
 

సమత హత్యపై నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసింది.
నిందితులను, సాక్షులను విచారించింది. 
ఈ విచారణ కూడా వేగంగా పూర్తయ్యింది. 

హజీపూర్ హత్య కేసు : –
మరోవైపు..హజీపూర్ హత్య కేసుల్లోనూ తుది తీర్పును పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 06కి వాయిదా వేసింది. జడ్జిమెంట్ కాపీ సిద్ధం కాకపోవడంతో వాయిదా పడింది. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఇతడిని తిరిగి నల్లొండ జిల్లా జైలుకు తరలించారు.

2019 అక్టోబర్ 14 నుంచి హాజీపూర్ కేసులపై విచారణ జరిగింది. ఈ కేసులో మొత్తం 300 మందిని సాక్షులుగా పేర్కొనగా… 101 మందిని ప్రశ్నించారు. విచారణ సమయంలో శ్రీనివాసరెడ్డిని జడ్జి పలు ప్రశ్నలు అడుగగా సమాధానమివ్వకుండా మౌనం వహించాడు. తనకేం తెలియదని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

అయితే పోలీసులు సేకరించిన ఆధారాలు పక్కాగా ఉండటంతో అతడి ఆటలు సాగలేదు. దిశ నిందితుల తరహాలోనే శ్రీనివాసరెడ్డిని శిక్షించాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు. ప్రస్తుతం ఈ రెండు తీర్పులపై ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ నెలకొంది. 

Read More : కౌన్సిల్ క్యాన్సిల్ : కేంద్రం ఒకే అంటుందా ? రాష్ట్రపతి ఆమోదం వేస్తారా