లోకల్ వార్ : సూర్యాపేట కలకోవలో టెన్షన్ టెన్షన్

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 01:58 PM IST
లోకల్ వార్ : సూర్యాపేట కలకోవలో టెన్షన్ టెన్షన్

సూర్యాపేట : జిల్లాలోని కలకోవలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌, టీఆర్ఎస్- సీపీఎం కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మునగాల మండలం కలకోవ గ్రామ పంచాయతీ అత్యంత సమస్యాత్మక ప్రాంతం. ఈ గ్రామంలో 20 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులే గెలుస్తున్నారు. ఈసారి సీపీఎం అభ్యర్థులను ఓడించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏకమయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రెండు వర్గాలకు సంబంధించి అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మొదటి రౌండ్ ఫలితం కాంగ్రెస్, టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థికి అనుకూలంగా రావడాన్ని సీపీఎం మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్-సీపీఎం మద్దతుదారులు ఘర్షణకు దిగారు. వెంటనే సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ, డీఎస్పీలు రంగంలోకి దిగారు. ప్రత్యేక బలగాలతో ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులను కౌంటింగ్ కేంద్రం నుంచి దూరంగా పంపేశారు. ఎస్పీ దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కౌంటింగ్ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశారు.