మాటల యుద్ధం : మోడీకి భయమెందుకు – బాబు

  • Published By: madhu ,Published On : May 11, 2019 / 01:17 AM IST
మాటల యుద్ధం : మోడీకి భయమెందుకు – బాబు

మాటలయుద్ధం కొనసాగుతూనే  ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు  చేసుకుంటున్నారు. ఎన్నికల్లో సెంటరాఫ్‌ పాయింట్‌గా మారిన  ఈవీఎంల పని తీరుపై పరస్పర విమర్శలకు దిగుతున్నారు.  ఓటమి భయంలో ఉన్న ప్రతిపక్షాలు ఈవీఎంలపై  నిందలేస్తున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. దీనికి బాబు కౌంటర్ ఇచ్చారు. వీవీ ప్యాట్‌లను 50శాతం లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని తాము  కోరుతుంటే.. మోడీకి భయమెందుకని కౌంటర్‌ ఇచ్చారు.

ఈవీఎంలపై ప్రధాని నరేంద్ర మోడీ వీటిపై స్పందించారు.   ప్రతిపక్షాలు కేవలం అబద్దాలతో ప్రచారం సాగిస్తున్నాయని… వారు  చెప్పే అబద్దాలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మొదటి  మూడు విడతల పోలింగ్‌ తర్వాత తమ పరిస్థితి దిగజారిందని  గ్రహించడం వల్లే విపక్ష పార్టీలు తనపైన, ఈవీఎంలపైనా, ఎన్నికల  కమిషన్‌పైనా విమర్శల దాడికి దిగుతున్నాయన్నారు. క్రికెట్‌లో  కొన్నిసార్లు ఆట బాగా ఆడలేక, ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు  సహజంగానే ఎంఫైర్‌ను నిందించడం మొదలుపెడతారని, ఇప్పుడు  విపక్షాలు కూడా అదే చేస్తున్నాయని విమర్శించారు. 

నరేంద్రమోడీ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్‌ ఇచ్చారు.   తమ పోరాటం భారత ఎన్నికల సంఘంపై కాదని.. అధికారుల  వివక్ష, పక్షపాత ధోరణిపైనేనని అన్నారు. మోడీ అమిత్‌షాపై  ఎన్నికల కోడ్‌ అమలు చేయకపోవడంపైనే ఈసీపై తాము పోరాటం  చేస్తున్నామన్నారు. వ్యక్తిగత అంశాలపై ఈసీని తామెప్పుడూ  విమర్శించలేదని గుర్తు చేశారు. వీవీ ప్యాట్‌లు లెక్కించాలని  ప్రతిపక్షాలు కోరుతుంటే.. మోదీ ఎందుకు భయపడుతున్నారని  ప్రశ్నించారు. ఆయన ఎందుకు  ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు.

ఈవీఎంల పని తీరుపై ప్రజలతోపాటు రాజకీయపార్టీ నేతల్లోనూ  అనేక అనుమానాలు ఉన్నాయి. కొన్ని పార్టీలు ఈవీఎంలను సపోర్ట్‌  చేస్తుంటే… మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈవీఎంలను  ట్యాంపరింగ్‌ చేయొచ్చని వాదిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు  సహా 22 పార్టీలకు చెందిన నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి  ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్‌ పేపర్లు వినియోగించాలని  లేఖలు రాశారు. అయినా సీఈసీ మాత్రం ఈవీఎంలతోనే ఎన్నికలు  నిర్వహిస్తుండగా…. వీవీప్యాట్‌లు కూడా లెక్కించాలని కోరాయి.  దీనికి ఈసీ ససేమిరా అనడంతో సుప్రీం కోర్టు గడపను తట్టాయి.  50శాతం వీవీప్యాట్‌లైనా లెక్కించాలని కోరాయి.