ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై విచారణ : ఈసీ ఆదేశాలు

  • Published By: chvmurthy ,Published On : November 19, 2019 / 06:24 AM IST
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై విచారణ : ఈసీ ఆదేశాలు

ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే సామాజిక వర్గంపై విచారణ మొదలైంది. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే కుల ధృవీకరణ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ వర్గానికి చెందిన వారో, కాదో తేల్చి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు.

2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాడికొండ నియోజక వర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీచేసిన ఉండవల్లి శ్రీదేవి…ప్రత్యర్ధి, టీడీపీ కి చెందిన శ్రావణ్ కుమార్ పై గెలుపొందారు.
నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంలో తనను కులం పేరుతో కొందరు దూషించారంటూ ఎమ్మెల్యే సీఎం జగన్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేసారు.

ఆ తరువాత ఎమ్మెల్యేను దూషించిన వారిపై కేసు నమోదు చేసారు. అప్పుడే, అసలు శ్రీదేవి ఎస్సీ కాదనే వివాదం మొదలైంది. దీని పైన అప్పట్లోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో.. ఎస్సీ కాని ఎమ్మెల్యే ఆ చట్టం కింద పెట్టిన కేసులు ఎలా నిలుస్తాయని ప్రశ్నించారు. దీనికి సంబంధించి అప్పటి నుండి రాజకీయంగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

అనంతరం ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పారు. వీటి ఆధారంగా లీగల్ రైట్స్ ప్రోటెక్షన్ ఫోర్స్ కు చెందిన సంతోష్ అనే వ్యక్తి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. క్రిస్టియన్ గా చెప్పుకున్న శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోజక వర్గంలో ఎలా పోటీ చేస్తారనే ప్రశ్న లేవనెత్తారు. ఈ ఫిర్యాదుతో రాష్ట్రపతి కార్యాలయం స్పందించి , వాస్తవాలు విచారించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఉండవల్లి శ్రీదేవి రిజర్వేషన్ అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లాజాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ను కోరింది. దీంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నవంబర్ 26న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని జాయింట్ కలెక్టర్ కోరారు. విచారణకు వచ్చేప్పుడు తాను ఎస్సీ గా నిరూపించుకునేందుకు అవసరమైన ఆధారాలు తీసుకురావాలని జేసీ సూచించారు.