యర్రగొండపాలెంలో రసవత్తర రాజకీయం : గెలుపు కోసం పార్టీల వ్యూహం

జనసేన చేయూతతో లెఫ్ట్‌ పార్టీ పూర్వవైభవాన్ని పునరుద్ధరిస్తుందా..? అసలు యర్రగొండపాలెంలో ఏం జరుగుతోంది..? 

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 03:34 PM IST
యర్రగొండపాలెంలో రసవత్తర రాజకీయం : గెలుపు కోసం పార్టీల వ్యూహం

జనసేన చేయూతతో లెఫ్ట్‌ పార్టీ పూర్వవైభవాన్ని పునరుద్ధరిస్తుందా..? అసలు యర్రగొండపాలెంలో ఏం జరుగుతోంది..? 

ప్రకాశం : కమ్యూనిస్టు పోరాటాల పురిటిగడ్డ.. లెఫ్ట్ పార్టీలకు బలంగా ఉన్న అతికొద్ది నియోజకవర్గాల్లో యర్రగొండపాలెం ఒకటి. కానీ ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యే నడుస్తోంది. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న జనసేన ఈ సమీకరణాలను ఎలా మారుస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. జనసేన చేయూతతో లెఫ్ట్‌ పార్టీ పూర్వ వైభవాన్ని పునరుద్ధరిస్తుందా..? అసలు యర్రగొండపాలెంలో ఏం జరుగుతోంది..?

 

1955లో ఏర్పాటైన యర్రగొండపాలెం 2004 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉంది. ఆ తర్వాత నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడుగా మారింది. లక్షా 84వేల 486 మంది ఓటర్లున్న యర్రగొండపాలెంలో ఎస్సీ ఓటర్ల సంఖ్య 24.8 శాతంగా ఉంది. ఎస్సీ రిజర్వుడుగా ఏర్పడ్డ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన ఆదిమూలం సురేష్.. టీడీపీ అభ్యర్థైన పాలపర్తి డేవిడ్ రాజుపై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీలో జరిగిన అభ్యర్థుల మార్పుచేర్పుల నేపథ్యంలో డేవిడ్‌ రాజు యర్రగొండపాలెం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో డేవిడ్‌ రాజు వైసీపీ నుంచి టీడీపీలోకి మారిపోయారు.

 

2019 ఎన్నికలు యర్రగొండపాలెంలో స్థానికంగా ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. డేవిడ్ రాజుకు బుద్దిచెప్పి.. మరోసారి ఇక్కడ విజయం సాధించాలని వైసీపీ పట్టుదలతో ఉంది. డేవిడ్‌ రాజు టీడీపీలోకి మారినా సంస్థాగతంగా మాత్రం వైసీపీ బలాన్ని తగ్గించలేకపోయారు. టీడీపీలో ఉన్న లుకలుకలతో అనుకున్న రేంజ్‌లో సైకిల్‌పై సవారీ చేయలేకపోతున్నారు. దీనికితోడు ముందునుంచి టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులు అంటీముట్టనట్లు పార్టీకి దూరంగా ఉంటున్నారు.

 

మరోవైపు జనసేన ఎంట్రీతో కమ్యూనిస్టులు జిల్లాలో తమకు పట్టున్న యర్రగొండపాలెంలో పూర్వ వైభవాన్ని నెలకొల్పాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కొంతమేర పట్టున్న ఈ స్థానంలో సత్తాచాటాలని ఎదురుచూస్తున్నారు. అధికార టీడీపీ ఈసారి ఎలాగైనా పసుపు జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. వలస వచ్చిన డేవిడ్‌ రాజుతో తెలుగు తమ్ముళ్లు అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఈసారి అభ్యర్థి మార్పు తథ్యమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. డేవిడ్‌ రాజు సైతం గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన సంతనూతలపాడు వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

 

ప్రకాశం జిల్లాలో ఉన్న 3 ఎస్సీ నియోజకవర్గాల్లో యర్రగొండపాలెం నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి జాతకాన్ని నిర్ణయించే కీలక నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యర్రగొండపాలెం అసెంబ్లీ సెగ్మెంట్‌లో వచ్చిన మెజార్టీనే ఒంగోలు భవితవ్యాన్ని నిర్ణయించింది. ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గంపై దృష్టిసారించాయి.

 

ఇంత కీలకమైన యర్రగొండపాలెంలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. వెలుగొండ ప్రాజెక్ట్ ఈ సెగ్మెంట్‌లోనే ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. నీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. అందుకే డేవిడ్‌ రాజు ఈసారి ఇక్కడ నుంచి పోటీచేసేందుకు సుముఖంగా లేరు. మరోవైపు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని రెండోసారి కూడా పాగా వేసేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. మొత్తానికి యర్రగొండపాలెంలో జెండా ఎగురవేయాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. మరి ఈసారి ఇక్కడి ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.