వర్గపోరుతో కాంగ్రెస్ కంచుకోటకు బీటలు

  • Published By: naveen ,Published On : July 20, 2020 / 02:17 PM IST
వర్గపోరుతో కాంగ్రెస్ కంచుకోటకు బీటలు

కాంగ్రెస్ కు కంచుకోట. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆ కోటకు బీటలు వారాయి. ఉన్న కొద్దిపాటి పట్టును కూడా అంతర్గత పోరుతో కోల్పోతోంది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వ్యవహారం చేరింది. అంతర్గత పోరు కాస్తా రచ్చకు ఎక్కడంతో పార్టీ పరువు మరింతగా దిగజారింది. ఇంత జరుగుతున్న పార్టీ పెద్దలు మాత్రం అటువైపు చూడకపోవడం కొసమెరుపు. ఇంతకీ అంతర్ యుద్ధానికి కారణాలు ఏంటి?

కామారెడ్డి కాంగ్రెస్‌లో గొడవలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు చిటిమిల్ల అరుణ సస్పెన్షన్‌ వివాదం ముదురుపాకాన పడింది. ఇపుడు ఆ వివాదం చినికిచినికి గాలివానలా మారి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డిపై కేసు నమోదయ్యే వరకు వెళ్లింది. అరుణపై గతంలో ఓ కేసు నమోదైంది. పార్టీలో నాయకుల మధ్య రచ్చ.. పోలీస్‌స్టేషన్‌ దాకా చేరడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో వార్డులకు అభ్యర్థుల టికెట్ల వ్యవహారంతో మొదలైన మంటలు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అరుణకు టికెట్ రాకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ ఇన్‌చార్జ్ సుబాష్‌రెడ్డి మందలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఈ వ్యవహరంపై డీసీసీకి ఫిర్యాదు చేయటం, ఆ తర్వాత పలువురు కార్యకర్తలు అరుణను ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషించడం.. అరుణ ఆగ్రహంతో కార్యకర్తలతో పాటు సుభాష్‌రెడ్డిని కూడా తిట్టడం.. పెద్ద తతంగమే నడిచింది. అప్పుడే ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అరుణపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. సుభాష్‌రెడ్డి తనను అసభ్యంగా తిట్టారంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాల కారణంగానే ఈ వివాదం ఇంత పెద్దదైందని కార్యకర్తలు అంటున్నారు.

ఎల్లారెడ్డి నుండి గెలిచిన సురేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి వర్గంగా పేరున్న సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి ఇంచార్జ్‌గా నియమించారు. అప్పటికే ఆ పదవిని ఆశించిన జమునా రాథోడ్‌కు ఇది నచ్చలేదు. తన అనుచరులకు మున్సిల్ ఎన్నికల్లో టికెట్ రాకుండా సుభాష్ రెడ్డి అడ్డుకున్నారంటూ జమున ఆగ్రహంగా ఉన్నారు. ఇక్కడ ప్రారంభమైన ఈ గొడవ చివరకు కేసుల వరకూ చేరుకున్నా పార్టీ పెద్దలు మాత్రం ఇప్పటి వరకూ పట్టించుకోలేదని కార్యకర్తలు కస్సుబుస్సులాడుతున్నారు. రెండు నెలల నుంచి ఈ తంతు కొనసాగుతున్నా రాష్ట్ర నాయకత్వం కలగజేసుకోలేదట. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌ పరిస్థితి అధ్వానంగా తయారైందని కేడర్‌ ఫీలవుతోంది.