AP CM జగన్ : PK జోస్యం

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 01:26 AM IST
AP CM జగన్ : PK జోస్యం

APలో YCP అధికారంలోకి వస్తుందా? ఏపీకి కాబోయే సీఎం జగనేనా ? ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన సూచనలు, సలహాలు ఫలించాయా? జగన్‌ – పీకే మధ్య ఏం చర్చ జరిగింది. జగన్‌కు PK సూచించిన సూచనేంటి ? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత YCP అధినేత జగన్‌ కాస్త రిలాక్స్‌ అయ్యారు. రెండేళ్లుగా వైసీపీ గెలుపు కోసం పని చేస్తోన్న PK టీమ్‌తో గడిపారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్న ఐప్యాక్‌ కార్యాలయానికి వైఎస్‌ జగన్‌ వెళ్లారు. అక్కడ ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌తో కాసేపు ముచ్చటించారు. ఒక్కొక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల కోసం పని చేసిన అందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

IPAC కార్యాలయంలో ప్రశాంత్‌ కిశోర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వివిధ అంశాలు చర్చకొచ్చాయి. జగన్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ కీలక సూచన చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్‌ సారథ్యంలోని YCP గెలవడం ఖాయమని ప్రశాంత్‌ కిశోర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో మీరే సీఎం కాబోతున్నారు.. మీరు సీఎం కావాలి… ప్రజలకు సుపరిపాలన అందించాలని పీకే జగన్‌కు సూచించారు. జగన్‌ సారథ్యంలో ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 

వైఎస్‌ జగన్‌ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద ధీమాగా ఉన్నారు. వైసీపీ అంతర్గత చర్చల్లో 110 నుంచి 130 సీట్లు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ కోసం తెరవెనుక పని చేసిన పీకేను, ఐప్యాక్‌ బృందాన్ని జగన్ అభినందించారు. తమ పార్టీ అంతర్గత చర్చల్లోనూ తామే అధికారంలోకి రాబోతున్నట్టు చర్చ జరిగిందని.. తమ గెలుపు కోసం పని చేసిన ఐప్యాక్‌ను టీమ్‌ను అభినందిస్తున్నానని జగన్ తెలిపారు. 

ఈ ఎన్నికల ప్రచారంలో జగన్‌ మోహన్‌రెడ్డితో పాటు ప్రశాంత్‌ కిశోర్‌నూ TDP టార్గెట్‌ చేసింది. రాష్ట్రాన్ని మరో బీహార్‌గా మార్చేస్తున్నారంటూ చంద్రబాబునాయుడు పరోక్షంగా PK మీద మండిపడ్డారు. ప్రశాంత్‌ కిశోర్‌ పేరుతో కొన్ని నకిలీ సర్వేలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో స్వయంగా ప్రశాంత్‌ కిశోర్‌ కూడా చంద్రబాబుకు కౌంటర్‌ ఇచ్చారు. బైబై బాబు అంటూ ట్వీట్‌ చేశారు. ప్రశాంత్‌ కిశోర్‌ ఒకవైపు జగన్‌కు ఐప్యాక్ టీంకు సేవలను అందిస్తూనే.. మరోవైపు రాజకీయ ఆరంగేట్రం కూడా చేశారు. బీహార్‌ అధికార పార్టీ జనతాదళ్‌ యునైటెడ్‌లో ఆయన చేరారు.