లోక కళ్యాణం కోసం పీసీసీ పదవి అడుగుతున్నా : జగ్గారెడ్డి

  • Published By: madhu ,Published On : November 14, 2019 / 10:26 AM IST
లోక కళ్యాణం కోసం పీసీసీ పదవి అడుగుతున్నా : జగ్గారెడ్డి

కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడానికి నేతలు ఆరాట పడుతున్నారు. ఎందుకంటే…టీపీసీసీకి నూతన సారథిని నియమించనున్నారన్న ప్రచారంతో కాంగ్రెస్‌లో కాక మొదలైంది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ చెప్పినట్లు..కొత్త చీఫ్ ఎంపికకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం సంగారెడ్డిలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 

లోక కళ్యాణం కోసం పీసీసీ పదవి కావాలని అడుగుతున్నానని చెప్పారు. తనకు ఒకవేళ అవకాశం ఇస్తే..పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. ఇందుకు ఎలాంటి మెడిసన్ కావాలో తన దగ్గర ఉందని, ఎవరికి వారు హీరో అనుకుంటే నడవదని ఇతర నేతలకు చురకలు అంటించారు జగ్గారెడ్డి. అన్ని వర్గాలు, మతాలకు కాంగ్రెస్ ప్రాధాన్యతనిస్తుందని, తన జీవితం ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభమైందన్నారు. తాను బహిరంగంగా అన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నానని, పదవి వస్తే..సోనియా, రాహుల్ సూచనల మేరకు పనిచెస్తానని చెప్పుకొచ్చారు. 

టీపీసీసీ అధ్యక్ష పదవికి పలువురు నేతలు పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్ బాబు పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు టాక్. పదవిని తాను ఆశిస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి సీడబ్ల్యూసీ నేత గులాం నబీ ఆజాద్ ఎదుట వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఎంపికలో సమతుల్యత పాటించాలని, వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు బూస్టింగ్ ఇచ్చే లీడర్ ఉండాలని  కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని సమాచారం. ఈ తరుణంలో జగ్గారెడ్డి చేసిన కామెంట్స్‌పై ఇతర నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read More :