కొన్నాళ్లు ట్రావెల్స్ వ్యాపారం ఆపేస్తా : జేసీ దివాకర రెడ్డి

  • Published By: chvmurthy ,Published On : November 15, 2019 / 11:41 AM IST
కొన్నాళ్లు ట్రావెల్స్ వ్యాపారం ఆపేస్తా : జేసీ దివాకర రెడ్డి

ట్రావెల్స్ వ్యాపారం కొంత కాలం ఆపేయాలనుకుంటున్నట్లు టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి చెప్పారు. ఇటీవల ఆర్టీఏ అధికారులు దివాకర్ ట్రావెల్స్ బస్సులపై దాడులు చేసి బస్సులను సీజ్ చేశారు. బస్సులు, ఇతర ఆస్తుల విషయంలో తనపై అనేక ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన చెప్పారు. తన బస్సులను సీజ్ చేయటంపై అధికారులపై ఎదురు కేసులు పెట్టటంతో వాళ్లు కాళ్లబేరానికి వస్తున్నారని, పై నుంచి అధికారుల ఒత్తిడి ఉందని చెబుతున్నారని అన్నారు. రోజూ కేసుల  గొడవ ఎందుకు కొన్నాళ్లు బస్సులు నిలిపివేస్తే బాగుంటుందని అనుకుంటున్నానని దివాకరరెడ్డి చెప్పారు. 

జగన్ ప్రభుత్వంలో ప్రతీకారవాంఛ ఎక్కువ అయ్యిందని జేసీ విమర్శించారు.  ప్రత్యర్ధులను హింసించేటప్పుడు అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలని జేసీ  హితవు పలికారు. వల్లభనేని వంశీ పార్టీ మారటం పై మాట్లాడుతూ…  వంశీ ఎమ్మెల్యేగా తెలుసు.. ప్రత్యేకంగా అనుబంధం ఏమీ లేదన్నారు. వంశీ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని.. ‘పార్టీ నుంచి బయటకు వెళ్లేప్పుడు నాదేం తప్పు లేదు.. అవతలి వారిదే తప్పని ఓ రాయి వేసి పోతారు. నాలుగు రోజులు జైల్లో పెట్టినా పర్లేదు అని ధైర్యంగా నిలబడితే పోయేదేమీ లేదన్నారు.

తనపై పార్టీ మరాలని ఒత్తిడి ఏమీలేదని, ఇటీవల ఒక పెద్దాయన కనపడి ఒకసారి వెళ్ళి జగన్ తో మాట్లాడి రమ్మని సలహా చెప్పాడని…తాను  ఆయన ఇంటికెళ్లి ఏమీ మాట్లాడనని, జగన్ ఎక్కడైనా కనిపిస్తే మంచి చెడూ మాట్లాడతాను అని దివాకర రెడ్డి చెప్పారు. ఇప్పటికే తన ట్రావెల్స్ కు చెందిన బస్సులను సీజ్ చేశారని జేసీ గుర్తు చేశారు.