కిషన్ రెడ్డిని తెగ కంగారుపెడుతున్న ఆ నియోజకవర్గం, కారణం అతడేనా?

  • Published By: naveen ,Published On : July 28, 2020 / 03:56 PM IST
కిషన్ రెడ్డిని తెగ కంగారుపెడుతున్న ఆ నియోజకవర్గం, కారణం అతడేనా?

జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్రమంత్రికి తలనొప్పిగా మారిందా? నియోజకవర్గ నేతల తీరుతో.. పార్టీ ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు వెళ్తోంది అంట. నాయకులు సైతం విడవమంటే పాముకు కోపం.. పట్టుకోమంటే కప్పకు కోపం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారంట. ఇంతకీ కేంద్రమంత్రిని ఇబ్బంది పెడుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమస్య ఏంటి?

జూబ్లీహిల్స్ బీజేపీ నేతల తీరుతో కిషన్ రెడ్డి విసుగు:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో జూబ్లీహిల్స్ కూడా ఒకటి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాంపల్లి, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ మెజారిటీ ఓట్లు సాధించింది. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సైతం మెజారిటీ ఓట్లు సాధించేందుకు కిషన్‌రెడ్డి ఇప్పటి నుంచే ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి ప్రత్యేకంగా పర్యటనలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ ముద్ర లోన్స్ వితరణ ఇదే నియోజకవర్గంలో మొదలు పెట్టారు. కాకపోతే ప్రతి పర్యటనలో అక్కడి నేతల తీరు ఆయనకు విసుగు తెప్పిస్తోందట.

సీనియర్లతో విభేదాలు, మర్యాద ఇవ్వరనే ప్రచారం:
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ విషయం జూబ్లీహిల్స్‌లోని బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడిందంట. దీనిని గుర్తించిన బీజేపీ నేతలు చక్కదిద్దేందుకు ప్రయత్నించినా వర్కవుట్‌ కాలేదంటున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన నేత ఒంటెద్దు పోకడలతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని కాషాయం నేతలు అంటున్నారు. ఆయనకు హైదరాబాద్ పట్ణణ పార్టీ అధ్యక్షుడితో సైతం విభేదాలున్నాయని, పార్టీలో ఉన్న సీనియర్లకు మర్యాద ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కన్వీనర్ ప్రేమ్ కుమార్‌ను, ఆర్గనైజేషన్ ఇన్‌చార్జ్ అట్లూరి కృష్ణను సంప్రదించకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట.

ఆ ఐడియాల తనవే అని చెప్పుకుంటున్నారట:
కేంద్ర మంత్రి నిర్వహించిన భారత మాత హారతి కార్యక్రమం తన ఐడియాగానే చెప్పకుంటున్నారంట జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీధర్‌రెడ్డి. కరోనా లాక్ డౌన్ సమయంలో కిషన్ సహకారంతో చెపట్టిన ఫీడ్ ద నీడ్ కార్యక్రమం కూడా ఆయన సొంతగా చేసినట్లు చెప్పుకుంటున్నారని అంటున్నారు. ఈ అంశాలన్నీ కిషన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో శ్రీధర్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకపక్క శ్రీధర్ తీరు, మరోపక్క ప్రేమ్ కుమార్, అట్లూరి పదేపదే చేసే ఫిర్యాదులతో కిషన్‌రెడ్డి అసహనానికి గురవుతున్నారట. ఈ వ్యవహారానికి ఎక్కడో ఒక చోట ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని ఆలోచన చేస్తున్నారంట.

ఏ వర్గానికి పెద్ద పీట వేస్తారో:
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, భవిష్యత్‌లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న కిషన్‌రెడ్డి… జూబ్లీహిల్స్ నేతల తీరుతో చికాకు పడుతున్నారట. ఈ వర్గ పోరు తారస్థాయికి చేరితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉండడంతో దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీ కూర్పుతో ఏ వర్గానికి కిషన్ రెడ్డి పెద్ద పీట వేస్తారనే విషయం తేలిపోతుందని భావిస్తున్నారు.