ఆ అధ్యక్ష పదవే.. వాళ్లిద్దరిని కలిపింది!

  • Published By: sreehari ,Published On : January 8, 2020 / 03:20 PM IST
ఆ అధ్యక్ష పదవే.. వాళ్లిద్దరిని కలిపింది!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయనకూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి మధ్య విభేదాలు కూడా వచ్చాయి. మరోసారి లక్ష్మణ్ అధ్యక్ష పీఠంపై కూర్చోడాన్ని కిషన్ రెడ్డి సహకరించడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి.

దీంతో వారిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అది కాస్త పోటాపోటీగా కార్యక్రమలు ఏర్పాటు చేసుకునేంత వరకు వెళ్ళింది. గత కొంతకాలంగా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఎడముఖం పెడ ముఖంలా వ్యవహరించారు. అయితే, ఇప్పుడు ఈ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిరిందంట. వారిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమైన అధ్యక్ష పదవే మళ్లీ కలిపిందంటున్నారు అనుచరులు.

కొత్త అధ్యక్షుడి ఎంపికపైనే చర్చ :
రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉండాలనే అంశంపై అధిష్టానం అభిప్రాయ సేకరణ చేసింది. లక్ష్మణ్ సైతం అధ్యక్ష పదవి కోసం సీరియస్ ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందనే విషయంపై తన అభిప్రాయాన్ని కిషన్‌రెడ్డి తొలుత చెప్పలేదట. ఇదే అదనుగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి తోడు రాంమాధవ్ సైతం ఆమెకు మద్దతు తెలిపారు.

దీంతో అధ్యక్ష పీఠం రేసులో లక్ష్మణ్ వెనుకబడ్డారనే వార్తలు వినిపించాయి. అంతే లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి అలెర్ట్ అయ్యారు. ఇటీవల వారిద్దరూ రెండు పర్యాయాలు రహస్యంగా భేటీ అయ్యారు. ఒకసారి లక్ష్మణ్ ఇంట్లో భేటీ కాగా మరోసారి ఓ లక్డీకపూల్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో కలుసుకున్నారు. రాష్ట్ర విభాగానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక అంశంపైనే ప్రధానంగా వారిద్దరూ చర్చించుకున్నారని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

లక్ష్మణ్‌తో కిషన్ దోస్తీ : 
రాష్ట్ర అధ్యక్ష పీఠానికి లక్ష్మణ్‌తో పాటు డీకే అరుణ పోటీ పడ్డారు. ఇప్పుడు లక్ష్మణ్‌తో పోటీ పడుతున్న అరుణ.. భవిష్యత్‌లో తనకు పోటీ అవుతారని కిషన్‌రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని పార్టీలోని నేతలు కూడా డిస్కస్‌ చేసుకుంటున్నారు. డీకే అరుణ, కిషన్‌రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే ప్రధాన కారణం.

దీంతో ఇక లాభం లేదనుకొని కొత్త అధ్యక్షుడిగా బీజేపీలో ఉన్న పాత కాపులైతేనే బెటర్‌ అని లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి అనుకొని ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చారని జనాలు అంటున్నారు. కొత్తగా చేరిన వారికి ఈ పదవి దక్కితే తమకు ఎసరొస్తుందనే అభిప్రాయం వ్యక్తం కావడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇప్పుడు ఇద్దరు నేతలు కలసి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. లక్ష్మణ్‌కే అధ్యక్ష పదవి దక్కితే తనకూ సేఫ్‌ అని కిషన్‌ భావించడంతో వీరి మధ్య సయోధ్య సాధ్యమైందని చెబుతున్నారు.