కరీంనగర్‌లో ఏం జరుగుతోంది : బీజేపీలోకి రవీందర్ సింగ్ ? 

  • Published By: madhu ,Published On : January 11, 2020 / 12:04 PM IST
కరీంనగర్‌లో ఏం జరుగుతోంది : బీజేపీలోకి రవీందర్ సింగ్ ? 

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక్కడ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మేయర్ రవీందర్ సింగ్ పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి గంగుల కమలాకర్‌తో విబేధాలున్నట్లు, ఇద్దరి మధ్య పొసగని వాతావరణం ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీలో చేరాలని ఆయన డిసైడ్ అయినట్లు టాక్.

టీఆర్ఎస్ గెలిచినా..మేయర్ స్థానాన్ని వేరే వారికి అప్పచెప్పుతారని రవీందర్ భావిస్తున్నారు. దీంతో పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి బలం చేకూరే విధంగా..ఎంపీ బండి సంజయ్‌తో ఓ హోటల్‌లో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. 2020, జనవరి 11వ తేదీ శనివారం జిల్లాల్లో జరిగిన గురునానక్ కార్యక్రమం సందర్భంగా కలిసిన వీరు..మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. పార్టీలో చేరితే..మేయర్ స్థానం ఇస్తామని రవీందర్ సింగ్‌కు బీజేపీ ఆఫర్ ఇచ్చింది.

గత మున్సిపల్ ఎన్నికల్లో మేయర్‌గా మైనార్టీ సిక్కు సామాజిక వర్గానికి చెందిన రవీందర్ సింగ్ గెలిచారు. పదవీకాలంలో కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. ఒక్క రూపాయకే నల్లా కనెక్షన్, ఆఖర్ సఫర్ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి చర్చకు తెరలేపారు రవీందర్ సింగ్. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విదేయుడిగా ఉన్న రవీందర్‌ సింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర మంత్రిగా గంగుల కమలాకర్ వచ్చాక..మాజీ మేయర్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని టాక్ వినిపిస్తోంది.

మున్సిపల్ ఎన్నికల శంఖారావంలో ఈ మాజీ మేయర్ కనిపించలేదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి పరోక్షంగా పని చేశారని, ఇందులో రవీందర్ సింగ్ ఉన్నట్లు టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వాస్తవాలు ఏంటో రానున్న రోజుల్లో తెలియనున్నాయి. 

Read More : హతవిధి : టి.మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు కరవు