కిలో ప్లాస్టిక్ తెస్తే KG చికెన్..KG బియ్యం

  • Published By: madhu ,Published On : January 13, 2020 / 01:43 AM IST
కిలో ప్లాస్టిక్ తెస్తే KG చికెన్..KG బియ్యం

ప్లాస్టిక్..ఓ అద్భుతమైన రసాయన పదార్థం. దీంతో అనేక వస్తువులు తయారు చేయవచ్చు. అందంగానూ..రంగు రంగులతో ఉండి..అత్యంత చౌకగా ఉండడంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. కానీ దీంతో అనేక దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు చెబుతున్నా..అంతగా ఫలితాలు రావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే దీనిపై నిషేధం విధించారు. ప్లాస్టిక్ వాడినా..దాని మందం తక్కువ ఉండేలా చర్యలు తీసుకొచ్చింది. అయినా…ఇంకా ప్లాస్టిక్ వస్తువులను వాడుతూనే ఉన్నారు. కొంతమంది వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.

 

కిలో ప్లాస్టిక్‌కు కిలో చికెన్
మీ దగ్గరున్న ప్లాస్టిక్ తీసుకొస్తే..ఇతర పదార్థాలు ఇస్తాం అంటూ ఆఫర్స్ ఇస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామ సర్పంచ్ కాయిత రాములు దీనిపై ఓ నిర్ణయం తీసుకున్నారు. కిలో ప్లాస్టిక్ తీసుకొస్తే..1kg చికెన్ ఇస్తానంటూ ప్రకటించారు కాయిత రాములు. దీంతో చాలా మంది గ్రామస్తులు ముందుకు వచ్చారు. నివాసాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చారు. అనుకున్నట్లుగానే సర్పంచ్ కాయిత రాములు తాను ఇచ్చిన హామీని పూర్తి చేశారు. కిలో చికెన్ అందచేశారు. 2020, జనవరి 12వ తేదీ ఆదివారం 10 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. పల్లె ప్రగతి రెండో విడత ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ సభకు ఎంపీపీ పారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి రవీందర్, ఎంపీడీవో పద్మావతి, తదిరులు హాజరయ్యారు. సర్పంచ్ కాయిత రాములు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అందరూ అభినందించారు. 

 

కిలో ప్లాస్టిక్‌కు కిలో రైస్
అలాగే…నిజామాబాద్ జిల్లా వేల్చూరు మండలం పచ్చలనడ్కుడ గ్రామ సర్పంచ్ ఏనుగు శ్వేత కూడా ఇదే విధంగా చేశారు. అయితే..కిలో చికెన్‌ ఇవ్వలేదు..కానీ కిలో బియ్యాన్ని మాత్రం ఇచ్చారు. ప్లాస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తమ గ్రామంలో ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు, అయినా..ఎవరి వద్దనైనా ఇంకా ప్లాస్టిక్ ఉంటే..తీసుకరావాలని..కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకొస్తే..కిలో బియ్యం అందిస్తామని ప్రకటించారు సర్పంచ్ ఏనుగు శ్వేత. 2020, జనవరి 13వ తేదీ ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 28 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చాయన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం 28 కిలోల బియ్యాన్ని అందించడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు అందరూ సహకరించాలని కోరారు. 

Read More : శబరిమల వివాదం..సుప్రీంలో వాదనలు