కర్నూలు కాంగ్రెస్‌కు భారీ షాక్ : సైకిల్ ఎక్కనున్న కోట్ల

  • Published By: madhu ,Published On : January 28, 2019 / 07:54 AM IST
కర్నూలు కాంగ్రెస్‌కు భారీ షాక్ : సైకిల్ ఎక్కనున్న కోట్ల

కర్నూలు : జిల్లా కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. పార్టీ వీడేందుకు సిద్ధమౌతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమౌతున్నారు. తన వద్దకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వడంతో కోట్ల..ఆయన నివాసానికి జనవరి 28వ తేదీ సోమవారం రాత్రి వెళ్లనున్నారు. భార్య, కుమారుడితో కలిసి బాబుతో భోజనం చేయనున్నారు. ఇదిలా ఉంటే జిల్లాకు చెందిన కోట్ల అనుచరులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కోట్ల నిర్ణయానికి తాము కట్టబడి ఉంటామని వారు ప్రకటించారు.

టికెట్ విషయంతోపాటు పార్టీలో కీలక పదవులపైనా స్పష్టమైన హామీ తీసుకున్నట్లు ఆయా జిల్లాల్లో ప్రచారం జరుగుతుంది. 2014  ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిచింది. 2019 ఎన్నికల క్రమంలో కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు. జిల్లాలో మంచి పట్టున్న మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని  పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన రాకను వ్యతిరేకిస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని సైతం ఒప్పించినట్లు తెలుస్తోంది. కోట్ల టీడీపీలో చేరితే కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. టీడీపీ ఆఫర్ పై ఇంకా  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కోట్ల. తనను కేంద్ర మంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని గతంలోనే ప్రకటించారు.

రాబోయే పదేళ్లలో కాంగ్రెస్ ఏపీ రాష్ట్రంలో బతికిబట్టకట్టే పరిస్థితులు కనబడటం లేదు. అలా అని  రాజకీయంగా కనుమరుగు అయ్యే ప్రమాదాన్ని కూడా కొనితెచ్చుకోలేరు కదా.. అందుకే కాంగ్రెస్ వీడాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా.. ఓ సీఎం కుమారుడి పార్టీలోకి.. మరో సీఎం కుమారుడు సాధారణ నేతగా కొనసాగటం అంటే కొంచెం కష్టమే. అందుకే టీడీపీలోకి వెళ్లాలని కోట్ల వర్గం నేతలు, అనుచరులు సూర్యప్రకాష్ రెడ్డిని కోరుతున్నారంట. మరి ఆయన ఎప్పుడు కండువా కప్పుకొంటారో చూడాలి మరి…