తల్లి బైలెల్లి నాదే : జన సంద్రంగా మేడారం

  • Published By: madhu ,Published On : February 5, 2020 / 09:55 AM IST
తల్లి బైలెల్లి నాదే : జన సంద్రంగా మేడారం

ఆదివాసీ కుంభమేళా మేడారం జాతర కొనసాగుతోంది. సమ్మక్క, సారలమ్మ మహా జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర .. 2020, ఫిబ్రవరి 05వ తేదీ బుధవారం నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. బుధవారం రాత్రికి మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో వనదేవతల పూజా కార్యక్రమాలు నిర్వహించటంతో .. జాతర మొదలవుతుంది.

గిరిజనుల ఆరాధ్యదైవం పగిడిద్దరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి సోమవారం బయల్దేరాడు. పగిడిద్దరాజు మూడురోజుల పాటు ప్రయాణించి, మేడారానికి బుధవారం రాత్రి 9 గంటలలోపు గద్దెలకు చేరుకోవటంతో..  జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క మేడారం చేరుకుని గద్దెలపై ఆసీనులవుతారు. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క, సారలమ్మ మూడోరోజున భక్తులకు దర్శనమిస్తారు. 

తెలంగాణా కుంభమేళాగా పిలిచే ఈ మేడారం జాతరకు .. ఏపీ, ఛత్తీస్ గడ్, ఒడిశా, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలలోని గిరిజనులు భారీగా తరలివస్తున్నారు. గిరిజనులే కాదు.. గిరిజనేతరులు, విదేశీ భక్తులు కూడా వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆదివాసీ దేవతలను దర్శించుకుంటున్నారు. మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.