బతుకు హామీ : ఉపాధిహామీ పనుల్లో AP కొత్త రికార్డు

  • Published By: madhu ,Published On : March 22, 2019 / 02:32 PM IST
బతుకు హామీ : ఉపాధిహామీ పనుల్లో AP కొత్త రికార్డు

ఏపీలో ఉపాధి హామీ పనుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో అనేక జిల్లాల్లో వలసలు నిలిచిపోయాయి. లక్ష్యాన్ని మించిన ఉపాధి హామీ పనులను చేపట్టి.. ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. ఉపాధి హామీ పేదల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. మరి ఈ ఉపాధి హామీ పనులు టీడీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి  ఉపయోగపడతాయా..? టీడీపీకి ఓట్లు కురిపిస్తాయా..? అసలు ఉపాధి హామీతో టీడీపీ ప్రభుత్వం ఏం సాధించింది..? 

ఉపాధి హామీ పనుల్లో ఆంధ్రప్రదేశ్‌ కొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 10 జిల్లాల్లో అంచనాలకు మించిన వృద్ధి సాధించింది. దీంతో ఇప్పటివరకు ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వలసలు నిలిచిపోయాయి. ఏపీలోనే పనులు లభిస్తుండడంతో.. పేద, మధ్య తరగతి ప్రజలు సొంత గ్రామాల్లోనే పనులు చేసుకుంటూ సంతోషంగా జీవితాలు గడుపుతున్నారు. ఉపాధిహామీ ఇచ్చిన ఆర్థిక భరోసాతో ధీమాగా కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది సెప్టెంబర్‌ నాటికి ఉపాధి కూలీలకు 15 కోట్ల 21 లక్షల పనిదినాలు కల్పించి.. వేతనాలుగా 3 వేల 117 కోట్ల 99 లక్షల ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌ చొరవతో 16 కోట్ల 47 లక్షల పనిదినాలు కల్పించి వేతనాలుగా 3 వేల 335 కోట్ల 47 లక్షలు చెల్లించారు. అంటే టార్గెట్‌ను మించిపోయారు. 

* చిత్తూరు జిల్లాలో అత్యధికంగా లక్షా 3 వేల మంది ఉపాధిహామీ పనులకు హాజరవుతున్నారు. 
* నెల్లూరు జిల్లాలో 186 కోట్లతో అత్యధికంగా అంచనాకు మించి 133 శాతం మేర పనులు చేపట్టారు. 
* కడప జిల్లాలో అత్యల్పంగా 46 శాతం మాత్రమే అంచనాను అందుకుంది. 
– మొత్తంగా 10 జిల్లాల్లో 100 శాతంపైగా పనులు జరిగాయి. 

* తూర్పుగోదావరి 122.13 శాతం, ప్రకాశం 120.97 శాతం, విజయనగరం 117.96 శాతం, చిత్తూరు 110.02 శాతం, పశ్చిమగోదావరి 109.87 శాతం, కృష్ణా 108.63 శాతం, అనంతపురం 104.86 శాతం, గుంటూరు 104.30 శాతం, శ్రీకాకుళం 102.92 శాతం మేర లక్ష్యాలు సాధించాయి. 

ఈ పథకంతో రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో మరింత ఉపాధి పెంపొందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోంది. ఉపాధిహామీ పనులు తక్కువగా జరిగిన జిల్లాలపై సంబంధిత మంత్రి నారా లోకేష్‌ వ్యక్తిగత సమీక్షలు నిర్వహించి పరిస్థితిలో మార్పునకు కృషి చేస్తున్నారు. స్వయంగా మంత్రి రంగంలోకి దిగడంతో.. అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పథకం అమలులో వెనుకబడిన ప్రాంతాల్లోని కూలీలకు పని కల్పించడానికి చొరవ చూపుతూ చురుగ్గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామీణప్రాంతాల్లో ఉపాధిహామీ పథకం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు వరంగా మారింది. ఒకప్పుడు పని వెతుక్కుంటూ దూరతీరాలకు వెళ్లి అయిన వారికి దూరంగా నానా ఇక్కట్లు పడ్డ లక్షలమందికి ఈ పథకం ఎంతో మేలు కల్పించింది.