బాబుకి రిటర్న్ గిఫ్ట్ : ఏపీలో మజ్లిస్ ఎన్నికల ప్రచారం

  • Edited By: veegamteam , January 7, 2019 / 04:34 PM IST
బాబుకి రిటర్న్ గిఫ్ట్ : ఏపీలో మజ్లిస్ ఎన్నికల ప్రచారం

విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టి కుదేలైన టీడీపీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ సిద్దమవుతోంది. మిత్ర పక్షాలతో దోస్తీ కట్టేందుకు రెడీ అవుతోంది.

ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ, ఎంఐఎం బంధం దిశగా చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తామని.. బహిరంగంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జెడీఎస్ తరపున ఎంఐఎం ప్రచారం నిర్వహించింది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన టీడీపీని .. రాకీయంగా దెబ్బతీసేందుకు .. అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి .. ఎంఐఎం మద్దతు ప్రకటించింది.

వాస్తవానికి వైఎస్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒవైసీ బ్రదర్స్ వైఎస్‌తో సన్నిహితంగా ఉన్నారు. వైఎస్ జగన్‌తోనూ అసదుద్దీన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వైసీపీ ఎంఐఎం జతకట్టే దిశగా చర్చలు సాగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డితో.. అసదుద్దిన్ ఒవైసీ భేటీ అయ్యారు. సూమరు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తాజా రాజాకీయాలపై చర్చించినట్లు సమాచారం. అసదుద్దీన్ ఒవైసీ, గౌతంరెడ్డికి మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఇరువురు భేటీ అయ్యారని పైకి చెబుతున్నా.. ఏపీలో జరగబోయే ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా ఎంఐఎం వుంది. అందులో భాగంగానే ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం నుంచి ఎలాంటి సహకారం అవసరమో .. గౌతంరెడ్డి ద్వారా అసదుద్దీన్‌కు వివరించినట్లు తెలుస్తుంది. రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ముస్లింలు నిర్ణయాత్మక ఓటర్లుగా ఉన్నారు. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో ముస్లిం ఓట్లను ఆకర్షించడానికి వైసీపీ తరపున ప్రచారం చేయాల్సిందిగా ఒవైసీని .. మేకపాటి గౌతంరెడ్డి కోరినట్లు తెలిసింది.

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అనుకున్నట్లు గానే వైసీపీ తరపున మజ్లిస్ ప్రచారం చేస్తుందా.. లేక స్నేహంతోనే సరిపెట్టుకుంటుందా అనేది చూడాలి.