వైసీపీలో బొత్సకు ప్రాధాన్యం తగ్గుతోందా? జగన్ తెలిసే చేస్తున్నారా?

  • Published By: naveen ,Published On : August 4, 2020 / 12:42 PM IST
వైసీపీలో బొత్సకు ప్రాధాన్యం తగ్గుతోందా? జగన్ తెలిసే చేస్తున్నారా?

ఉత్తరాంధ్రలో మకుటం లేని మహారాజుగా పేరొందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మున్సిపల్ శాఖ బాధ్యతలు సైతం ఆయనే నిర్వర్తిస్తున్నారు. తాను పదవులు సంపాదించుకోవడమే కాదు… తనను నమ్ముకున్న వారికి సైతం పదవులు వరించేలా చేయడం బొత్సకే సాధ్యం. కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు దశాబ్దకాలం పాటు మంత్రి పదవుల్లో ఉంటూ… తిరుగులేని నేతగా ఎదిగారు. జిల్లాలో సైతం దాదాపు అన్ని పదవులను తన అనుచరులకే వరించేలా చక్రం తిప్పి, తన మార్క్ రాజకీయాలతో కీలక నేతగా ఎదిగారు.

బొత్సను కాదని జూనియర్ కు డిప్యూటీ సీఎం పదవి:
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో తాను చెప్పిందే వేదం అన్నట్టుగా సాగింది. ఆ తర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి రావడంతో మెల్లమెల్లగా బొత్స ప్రాభవం తగ్గుతూ వచ్చింది. వైసీపీలోకి అడుగుపెట్టిన తర్వాత బొత్స దూకుడు తగ్గిందనే చెప్పుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొత్స ఎక్కువ కాలం హైదరాబాద్‌లోనే గడిపారు. జిల్లా రాజకీయాలను తన మేనల్లుడు చిన్న శ్రీనుకు అప్పగించేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం, పవర్‌లోకి రావడంతో బొత్స సత్యనారాయణకు కూడా మంత్రి పదవి దక్కింది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా… జిల్లాకు ఒక డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడం అప్పట్లో మంత్రి బొత్స వర్గానికి పెద్ద షాకే తగిలింది. సీనియర్ నేత, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న బొత్సను కాదని, తన కన్నా ఎంతో జూనియర్ అయిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడం బొత్స వర్గాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.

జగన్ ప్రభుత్వంలో బొత్సకు సరైన ప్రాధాన్యం లేదా?
ఆ విషయాన్ని అంతగా పట్టించుకోని మంత్రి బొత్స… అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కొంత ఉత్సాహంగానే కనిపించారు. జిల్లా పర్యటనలో ఉత్సాహంగా పాల్గొంటూ, మునుపటి దూకుడు ప్రదర్శించేవారు. సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేవారు. అయితే, క్రమంగా బొత్సలో ఆ స్పీడ్ తగ్గుతూ వస్తోందని సొంత కేడర్ నుంచే అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరుగాంచిన ఆయనకి జగన్ ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదంటూ అనుచరులు గుసగుసలాడుతున్నారు.

బొత్సకు తెలియకుండానే కీలక నిర్ణయాలు:
జిల్లా రాజకీయాల్ని శాసించే బొత్స సత్యనారాయణను మున్సిపల్ మంత్రిని చేసిన జగన్… అదే జిల్లా నుంచి మరో జూనియర్ నేత పుష్ప శ్రీవాణిని ఏకంగా డిప్యూటి సిఏం చేయడంతో జిల్లాలో బొత్స తరచూ ప్రొటోకాల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా, జిల్లా పాలనా వ్యవహారాలకు సంబంధించి గతంలో మాదిరిగా నేరుగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. సమీక్షలు, సమావేశాల్లో సైతం అధికారులకు గట్టిగా చెప్పలేకపోతున్నారని, మునుపటి దూకుడు, తక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారన్న చెవులు కొరక్కుంటున్నారు. ఇక జిల్లా అభివృద్ధికి సంబంధించి భోగాపురం ఎయిర్ పోర్టు వ్యవహారం గానీ, రాజధాని అభివృద్ధికి సంబంధించి గానీ మంత్రి బొత్సకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు చకచకా జరిగిపోతున్నాయన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందుకే, బొత్స కూడా ఈ వ్యవహారంలో అంతగా స్పందించడం లేదన్న వార్తలు వస్తున్నాయి.

ధర్మానకు కీలక శాఖ, తీవ్ర నిరాశలో బొత్స వర్గం:
మూడు రాజధానుల వివాదం, సీఆర్డిఏ రద్దు వంటి కీలక నిర్ణయాలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం వరకే మంత్రి బొత్స పరిమితమవుతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. సీనియర్ నేతగా బొత్సకు ఎప్పటికైనా మంచి హోదాతో పదవి దక్కుతుందని, మంత్రివర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సీఎం జగన్ ఇస్తారన్న ఆశాభావంతో బొత్స వర్గం ఎదురు చూస్తున్నా.. ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదంట. తాజాగా మంత్రి వర్గ విస్తరణలో పక్క జిల్లాలో మొదటిసారి మంత్రి అయిన ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వడం బొత్స వర్గాన్ని మరింత నిరాశలోకి నెట్టేసింది.

కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎంతో పాటుగా కీలకమైన రెవెన్యూ శాఖను సైతం అప్పగించడంతో బొత్స అభిమానులు నిరాశ చెందారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పదవులు, కేటాయింపులకు సంబంధించి మంత్రి బొత్స మౌనంగా ఉన్నా… ఆయన కేడర్ మాత్రం లోలోపల తీవ్ర అసహనం, అసంతృప్తికి గురవుతున్నారట.