దమ్ముంటే ఛాలెంజ్ చేయ్.. అన్నీ బయటపెడతా ..బొత్స 

10TV Telugu News

అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ అక్రమాలపై  తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని  మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది అనటానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న బొత్స అవసరమైనప్పుడు అన్నీ బయట పెడతామని తెలిపారు.

మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు తనకు రాజధానిలో భూములు లేవని అంటున్నారని.. సవాల్ విసిరితే మొత్తం బయట పెడతామని బొత్స అన్నారు. ఈ విషయంపై మీడియా మధ్యవర్తిత్వం చేయాల్సిన అనవసరం లేదని హితవు చెప్పారు. నాలుగు రాజధానుల విషయం టీజీ వెంకటేష్ నే అడగండని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రాజధాని విషయంలో పవన్.. గతంలో ఏం మాట్లాడారో ఇప్పుడు ఏం మట్లాడారో రికార్డులు చూస్తే తెలుస్తుందన్నారు మంత్రి బొత్స. బీజేపీ కూడా గతంలో రాజధానిపై విమర్శలు చేసిందని….. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందినది కాదని స్పష్టం చేశారు. రాజధాని ఫ్రాంతంలో భూములు కొన్న రాజకీయ నాయకుల పేర్లు అవసరమైనప్పుడు బయట పెడతానని బొత్స బాంబు పేల్చారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరెవరికి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో అన్నీ వెలుగులోకి తెస్తామని మంత్రి బొత్స తేల్చి చెప్పారు.