కాంగ్రెస్ హయాంలో మంచినీరు కూడా దొరికేవి కావు : మంత్రి జగదీష్ రెడ్డి

  • Published By: bheemraj ,Published On : July 7, 2020 / 06:30 PM IST
కాంగ్రెస్ హయాంలో మంచినీరు కూడా దొరికేవి కావు : మంత్రి జగదీష్ రెడ్డి

కాంగ్రెస్ తీరుపై మంత్రి జగదీశ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో మంచినీరు కూడా దొరికేవి కావని…రెండు, మూడు కిలో మీటర్లు నడవాల్సి వచ్చేదని అన్నారు. కాంగ్రెస్ మాటలు వారి బానిస మనస్థత్వాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం (జులై7, 2020 మీడియాతో మాట్లాడుతూ పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టం, కేంద్రం నుంచి రావాల్సిన సహాయం, నిధులు గురించి కొట్లాడాలని సూచించారు. రాష్ట్రమే వద్దు హైదరాబాద్ ను పరాయి పరిపాలన కింద పంపుదాం, హైదరాబాద్ ప్రజలకు సొంత పరిపాలన వద్దు అనే మూర్ఖత్వం కాంగ్రెస్ నేతలదని విమర్శించారు.

కేసీఆర్ పరిపాలనతోటి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశమే ఎన్నో రకాల పథకాలను తెలంగాణ నుంచి తీసుకుందన్నారు. భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం అందరి కంటే తెలంగాణలోనే ఎక్కువ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి భారత దేశంలో అతి తక్కువ తలసరి వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణైతే కేవలం ఆరేళ్లళ్లో దేశం మొత్తంలో అత్యంత అధిక తలసరి వినియోగం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు. మంచినీటి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మీరు, మీ ఆంధ్ర యజమానులు కలిసి మంచి నీటి కోసం గ్రామాల్లో రెండు, మూడు కిలో మీటర్లు పోవాల్సిన దుస్థితి ఉండేదని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానిచారు. పట్టణాల్లో వారం, పది రోజులు, పదిహేను రోజులు ఒక బిందెడు మంచినీరు కోసం ఎదురు చూసే దుస్థితి ఉండేదన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మిషన్ భగీరథతో ఏ మూలన ఉన్న చిన్న గోండు గూడెం, గిరిజన తండా అయినా, దళిత వాడైనా, ఏ బస్తీ అయినా ప్రతి రోజు కృష్ణా, గోదావరి నదుల నుంచి సురక్షితమైన మంచినీరు తీసుకొచ్చి దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో మంచినీరు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ప్రత్యేకించి వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయమే దండుగని మీ యజమానులు మాట్లాడారని గుర్తు చేశారు. ఆనాడు మీరెలాగో బానిసలు, మీకు సొంత గొంతులు లేవని ఎద్దేవా చేశారు. మీ పరిపాలనలో మహబూబ్ నగర్ నుంచి 14 లక్షల మంది వలసలు పోయారో, నల్గొండ జిల్లా నడుములు వంకరబోయుండనో.. అదే జనం తమ పరిపాలనలో గ్రామాలకు తిరిగి వస్తున్నారని తెలిపారు.

నేను రైతును..వ్యవసాయం చేస్తున్నానని ప్రతి ఒక్కరు చెప్పుకునే రోజులు వచ్చాయంటే అది కేసీఆర్ పరిపాలన వల్ల, వ్యవసాయ రంగం పట్ల ముఖ్యమంత్రి చూపిస్తున్న మక్కువ వల్ల అని స్పష్టం చేశారు. బడ్జెట్ లో ప్రతి సంవత్సరం వ్యవసాయ రంగానికి పెడుతున్న నిధులు సగానికి పైగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుపుతుందన్నారు. భారతదేశ రైతాంగమే ఇప్పుడు తెలంగాణ వైపు, కేసీఆర్ వైపు చూస్తోందన్నారు. 40 ఏళ్లు పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టులను రెండు, మూడు ఏళ్లళ్లో పూర్తి చేసి 30 నుంచి 40 లక్షల ఎకరాలకు కొత్తగా నీరిచ్చి రైతాంగాన్ని ఆదుకుంటున్నామని తెలిపారు.

‘రైతు బంధ పథకం మీరు కలలో కూడా ఊహించలేరు. మీరు వంద జన్మలెత్తినా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు మీరు కలలో కూడా అనుకోలేదని మీతోటి సాధ్యం కాదని, కలలు కనడం కూడా మీకు సాధ్యం కాదన్నారు. నేరుగా రైతు ఖాతాలోకి పెట్టుబడి మద్దతు ఇచ్చే పథకం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదన్నారు. ఏ రైతు చనిపోయినా ఐదు లక్షల రూపాయాల బీమా ఇంటికి వారం రోజుల్లో వచ్చే పథకం ఎక్కడైనా ఉందా? మీరు చూపించగల్గుతారా? మీరు ఏవైతే పిచ్చి డిమాండ్లు చేస్తున్నారో మీ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా… మీ బతుకుకు మూడు రాష్ట్రాలు మిగిలాయని అక్కడ మేము ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేస్తున్నారా’ అని ప్రశ్నించారు. ప్రత్యేకించి కోవిడ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్రం తీసుకున్న అనేక చర్యలను మిగతా రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయని తెలిపారు.