ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్

  • Published By: madhu ,Published On : February 13, 2020 / 05:35 PM IST
ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్

ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. డీమానిటైజేషన్, సీఏఏపై రాష్ట్ర అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తెలంగాణకు ఇస్తున్న నిధులపైనా నిర్మలా సీతారామన్‌కు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయడాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు. 

2020, ఫిబ్రవరి 13వ తేదీ గురువారం ఢిల్లీలో జరిగిన టైమ్స్‌ నౌ యాక్షన్ ప్లాన్ – 2020 సమ్మిట్‌‌లో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. ఢిల్లీలో కూర్చుని, పాలిస్తున్న కేంద్రప్రభుత్వానికి సూటిగా సుత్తి లేకుండా కొన్ని ప్రశ్నలు సంధించారు. కేంద్ర చెబుతున్న లెక్కల్లో నిజానిజాలేంటో నిగ్గుతేల్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ను సెకండ్‌ క్యాపిటల్‌గా చేస్తారనే ప్రచారంపై కేటీఆర్‌ స్పందించారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించాల్సి వస్తే.. హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. 

డిమానిటైజేషన్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందన్న మోడీ మాటలు నమ్మి మద్దతు ఇచ్చామన్న కేటీఆర్‌.. దానిల్ల దేశానికి నష్టం జరగడంతో తమ నిర్ణయం తప్పని తెలుసుకున్నామన్నారు. సీఏఏను పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని కేటీఆర్‌ చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వానికే తమ పార్టీ ఓటు వేస్తుందని స్పష్టం చేశారు. 

దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే అని.. దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలంటూ ఏవి లేవన్నారు మంత్రి కేటీఆర్‌. బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం పెద్దసైజు ప్రాంతీయ పార్టీలని కేటిఆర్‌ తెలిపారు. కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సొంత నిధులు ఇస్తున్నామన్న ఆలోచన మంచిది కాదన్నారు కేటీఆర్‌. తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల 72 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే.. తిరిగి రాష్ట్రానికి కేంద్రం లక్షా 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. 

నీతి అయోగ్, తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా.. ఇప్పటి దాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు కేటీఆర్. కోపరేటివ్ ఫెడరలిజం, టీమ్ ఇండియా వంటి మాటలు చెప్పే ప్రధానమంత్రి.. ఆ భావనల స్ఫూర్తి ఆధారంగా పని చేయాలని కోరుకుంటున్నామని ఫైనల్‌ టచ్‌ ఇచ్చారు కేటీఆర్‌.