అధికారులు లంచం అడిగితే కేసీఆర్, కేటీఆర్ పేరు చెప్పండి

  • Published By: chvmurthy ,Published On : February 25, 2020 / 10:02 AM IST
అధికారులు లంచం అడిగితే కేసీఆర్, కేటీఆర్ పేరు చెప్పండి

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇంటి నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వకుండా మున్సిపల్  చట్టం తీసుకువచ్చామని  పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌  చెప్పారు. 75 గజాల స్ధలంలో ఇల్లు నిర్నించుకునే వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి  ఇల్లు నిర్నించుకోవచ్చని…75 నుంచి 600 గజాల లోపు ఇల్లు నిర్నించుకోవాలంటే మీసేవా సెంటర్ ద్వారా కానీ ఆన్  లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో మీకు అనుమతి వస్తుందనితెలిపారు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు చెప్పమని ఆయన ప్రజలకు సూచించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో మంత్రి నేడు పర్యటించారు.  అన్నీ బిల్డింగ్ రూల్స్ ప్రకారం ఇల్లు కట్టుకోవాలని ఆయన సూచించారు.  మనం మారుదాం.. మన పట్టణాన్ని మార్చుకుందాం అనే నినాదంతో ప్రజలు తమ పట్టణాలను సుందరంగా చేసుకోవాలని ఆయన అన్నారు. 

పట్టణ ప్రగతిలో భాగంగా దేవరకొండ 10వ వార్డులోని హనుమాన్‌నగర్‌, లక్ష్మీకాలనీ, అయ్యప్పనగర్‌, జంగాల కాలనీల్లో మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దేవరకొండలో ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దేవరకొండలో కోతుల, పందుల బెడదను పరిష్కరిస్తామన్నారు. ఆరు ఎకరాల స్థలంలో డంపింగ్‌యార్డు నిర్మిస్తామన్నారు.

ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్‌ ఆటోలకు అందించాలని కోరారు. తడి చెత్తతో ఎరువును తయారు చేయనున్నట్లు తెలిపారు. సఫాయి కార్మికుల శ్రమవల్లే పట్టణాలు పరిశుభ్రంగా ఉంటున్నాయన్నారు. ఖాళీ ప్రదేశాల్లో ముళ్లపొదలు, చెట్లు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పట్టణంలో పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించి రాష్ట్రంలో బహిరంగ మలమూత్ర విసర్జన ఉండకుండా చేస్తామన్నారు. అత్యుత్తమ పౌరసేవలే లక్ష్యంగా నూతన మున్సిపల్‌ చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. 

నూతన మున్సిపల్‌ చట్టం ద్వారా ప్రతి మున్సిపాలిటీలో 10 శాతం నిధులు హరితహారం కోసం ఖర్చు చేసేలా నిబంధనలున్నాయన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బ్రతకాలి.. లేకపోతే కఠినచర్యలు తప్పవన్నారు. మున్సిపాలిటీల్లో ఇకపై లంచాల మాట వినపడొద్దని మంత్రి పేర్కొన్నారు.