కర్నూలులో తిరగలేరు… మంత్రికి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

వైసీపీలోని ఇద్దరు నేతల మధ్య  ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు బహిర్గతమైంది. మంత్రి అనిల్‌ తీరుపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ మండిపడుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 2, 2020 / 01:31 AM IST
కర్నూలులో తిరగలేరు… మంత్రికి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

వైసీపీలోని ఇద్దరు నేతల మధ్య  ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు బహిర్గతమైంది. మంత్రి అనిల్‌ తీరుపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ మండిపడుతున్నారు.

వైసీపీలోని ఇద్దరు నేతల మధ్య  ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు బహిర్గతమైంది. మంత్రి అనిల్‌ తీరుపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ మండిపడుతున్నారు. నియోజకవర్గంలో తనను కాదని.. మరొకరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవులతోపాటు కాంట్రాక్టుల్లోనూ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆర్థర్‌ ఆరోపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే ఆర్థర్‌ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.

అనిల్‌, ఆర్థర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు:
ఇద్దరూ ఏపీలోని అధికార పార్టీకి చెందిన నేతలే. ఒకరు జిల్లా ఇంచార్జీ మంత్రి. మరొకరేమో ఎమ్మెల్యే. వీరిద్దరి మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు మొదలైంది. ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న ఈ పోరు.. బహిర్గతమైంది. నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇందుకు వేదికైంది.

పదవులు, కాంట్రాక్టులు మంత్రి అనుచరులకే:
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌… కర్నూలు జిల్లా ఇంచార్జీ మంత్రిగా కూడా ఉన్నారు. అయితే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌… మంత్రి అనిల్‌కుమార్‌ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తన నియోజకవర్గ వ్యవహారాల్లో మంత్రి అనిల్‌కుమార్‌ జోక్యం చేసుకుంటున్నారన్నది ఎమ్మెల్యే ఆర్థర్‌ వాదన. నామినేటెడ్‌ పదవుల భర్తీ నుంచి కాంట్రాక్ట్‌ వరకు అన్నీ తన అనుచరులకు ఇప్పించుకునేందుకు అనిల్‌ ప్రయత్నిస్తున్నారన్నది ఆర్థర్‌ ప్రధాన ఆరోపణ. అందుకే ఆర్థర్‌, ఆయన అనుచరులు మంత్రి అనిల్‌ మీద ఆగ్రహంతో ఉన్నారు.

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్ పదవి చిచ్చు:
నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటి చైర్మన్ పదవికి ఎమ్మెల్యే ఆర్థర్‌ తన అనుచరుడి పేరును ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకొచ్చారు. నియోజకవర్గానికి చెందిన కీలక నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మరో పేరును సూచించారు. అయితే మంత్రి అనిల్‌మాత్రం…. సిద్ధార్థరెడ్డి సిఫారసు చేసిన వ్యక్తికి నందికొట్కూరు ఏఎంసీ పదవి ఇప్పించేందుకు పావులు కదిపారు. ఇది ఎమ్మెల్యే ఆర్థర్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఎమ్మెల్యేగా తాను సూచించిన వ్యక్తిని కాదని… సిద్ధార్థరెడ్డి సిఫారసు చేసిన వ్యక్తికి పదవి ఇప్పించేందుకు మంత్రి ప్రయత్నించడం వివాదానికి కారణమైంది. ఇదే విషయంపై ఎమ్మెల్యే ఆర్థర్‌ అనుచరులు మంత్రి అనిల్‌ను బహిరంగంగానే నిలదీశారు. ఈ విషయం పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్లడంతో నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నియామకానికి బ్రేక్ పడింది. 

కర్నూలులో తిరగలేరని మంత్రికి వార్నింగ్:
మార్కెట్‌ కమిటీ నియామకం విషయమే కాదు.. నియోజకవర్గంలో కాంట్రాక్ట్‌ల అంశంపైనా మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే ఆర్థర్‌ మధ్య వివాదం నెలకొంది. మంత్రి అనిల్‌ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటూ.. సిద్ధార్థరెడ్డికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆర్థర్‌ అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రతి విషయంలో మంత్రి జోక్యం చేసుకుంటే.. ఎమ్మెల్యే ఏం చేయాలని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఇకపై కూడా ఇదే వైఖరి కొనసాగితే సహించబోమని హెచ్చరించారు. మంత్రి అనిల్‌ అత్యుత్సాహం ప్రదర్శిస్తే కర్నూలు జిల్లాలో తిరగలేరంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

బజారున పడ్డ పార్టీ పరువు:
మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే ఆర్థర్‌ మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం కావడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు మాత్రం నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ పరువుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రతిష్ఠ మరింత దిగజారకముందే, పరువు బజారున పడకముందే పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని సూచిస్తున్నారు.