నేతల ఘాటు పాలిటిక్స్ : గుంటూరు టీడీపీలో మిర్చి మంటలు

నేతల ఘాటు పాలిటిక్స్ : గుంటూరు టీడీపీలో మిర్చి మంటలు

గుంటూరు మిర్చియార్డు విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆసియాలోనే అతి పెద్దది. పాలకవర్గం గడువు ముగిసి ఐదు నెలలు అవుతుంది. అయినా కొత్త సభ్యుల నియామకం జరగలేదు. ఎవరికి వారు తమ వారిని పాలకవర్గంలో చేర్చాలని పట్టుబడుతుండడంతో ఎటూ కాకుండా పోతోంది. మరోవైపు ఎన్నికల కోడ్‌ సమీపిస్తుండడంతో అసలు పాలకవర్గం కొలువుదీరుతుందా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. 

మిర్చి యార్డ్‌ పాలకవర్గం డైరెక్టర్ల నియామకంలో తమ వారికి చోటు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుపడుతున్నారు. ద్వితీయశ్రేణి నాయకులకు.. డైరెక్టర్ల పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు మమ్మురం చేస్తున్నారు. అన్యాయం జరిగితే.. వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ, తాడికొండ, పత్తిపాడు నియోజకవర్గాల్లో టీడీపీకి అసమ్మతి వాదులు ఎక్కువయ్యారు. గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి వర్గమైన వెన్నా సాంబశివరావుకు .. యార్డు చైర్మన్‌ పదవి ఇస్తామని చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా మన్నవ సుబ్బారావు పేరు తెరపైకి వచ్చింది. ఆయన మంత్రి పుల్లారావు వర్గం కావడంతో ఎలాంటి అడ్డంకి లేకుండా యార్డు చైర్మన్ అయ్యారు. ఇక మోదుగుల విషయానికొస్తే టీడీపీ వీడతారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆవర్గానికి చెందిన వెన్నాకు అవకాశం ఇస్తే అనవసర తలనొప్పులు వస్తాయని జిల్లా నేతలు భావిస్తున్నారు. మూడు నెలలుగా ఇదే విషయంలో జిల్లా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.  

 

మిర్చి యార్దు పాలకవర్గం గడువు 2018, సెప్టెంబర్‌లోనే ముగిసింది. నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నేత వెన్నా సాంబశివా రెడ్డికి యార్డు చైర్మన్ పదవి ఇస్తున్నట్లు మంత్రి పుల్లారావు ప్రకటించారు. అప్పటి నుంచి వైస్ చైర్మన్, డైరెక్టర్ల ఎంపికలో టీడీపీ శ్రేణుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పాలకవర్గం కూర్పు వాయిదా పడుతూ వస్తోంది. విజయదశమి ముందురోజు జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రగిరి ఏడుకొండలు పేరును వైస్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందారు. యార్డు డైరెక్టర్ల విషయంలో తమను సంప్రదించకుండా చేశారని పొన్నూరు ఎమ్మెల్యే దూళ్ళిపాళ్ల నరేంద్ర అసంతృఫ్తితో ఉన్నారు. 

 

మిర్చి యార్డు పరిధిలోకి గుంటూరు ఈస్ట్, వెస్ట్, పత్తిపాడు, పోన్నూరు నియోజకవర్గాలు వస్తాయి. పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు జనసేనలో చేరడంతో డైరక్టర్ల ఎంపిక భాద్యత ఎంపి గల్లా జయదేవ్ తీసుకున్నారు. ఎంపీ కోటాలో సభ్యుల పేర్లను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపారు. అయితే వైస్ చైర్మన్ పదవి తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పట్టుబట్టడంతో జాబితాను మార్చారు. ఈ జాబితాలో హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, రైతుల సొమ్ము స్వాహా చేసిన వ్యక్తుల పేర్లు ఉండటంతో.. అధిష్టానం జిల్లా కమిటీని మందలించింది. మరోవైపు ఇప్పటికే వివాదాల్లో ఉన్న తాడికొండ నియోజకవర్గం నుంచి యార్డు డైరక్టర్లుగా కొంతమంది టీడీపీ నేతలు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అటు ఎంపీ రాయపాటి వర్గం, గల్లా జయదేవ్ వర్గం, దూళిపాళ్ల వర్గాలతో తమవారికంటే తమవారికేనంటూ పట్టుబట్టడంతో అదిష్టానం తల పట్టుకుంది. 
 
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకులు జారిపోకుండా నేతలు పావులు కదుపుతున్నారు. మరో వైపు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల అనుచరుడు వెన్నా సాంబశివారెడ్డి కావడం వల్లే పాలకవర్గం కూర్పు ఆలస్యమవుతోందని కొంతమంది టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అసలు మిర్చియార్డు పాలక వర్గం కొలువు దీరుతుందా లేదా అన్న సందేహాన్ని టీడీపీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నారు. మిర్చి రైతులు మాత్రం ప్రభుత్వం జిల్లా నాయకుల ఏకాభిప్రాయం తీసుకుని త్వరగా పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి యార్దులో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని కోరుతున్నారు.