ఓటర్ల ఆవేదన : వెయ్యి రూపాయలిచ్చి ఒట్టు వేయించుకుంటున్నారు

  • Published By: veegamteam ,Published On : May 6, 2019 / 06:55 AM IST
ఓటర్ల ఆవేదన : వెయ్యి రూపాయలిచ్చి ఒట్టు వేయించుకుంటున్నారు

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ వ్యవహారం కలకలం రేపింది. జడ్పీటీఎసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో… ఓ పార్టీకి చెందిన  అభ్యర్థులు.. ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓటుకి వెయ్యి రూపాయలు ఇచ్చి తమకే ఓటు వేయాలని ప్రమాణం చేయిచుకుంటున్నారని ఓటర్లు  అంటున్నారు. అంతేకాదు కులాల ప్రస్తావన తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా కులం వాడికే ఓటు వేయాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఓటు వేసే  స్వేచ్ఛ కూడా లేదా అని వారు నిలదీస్తున్నారు. తాము డబ్బుకి అమ్ముడుపోమని.. తమకు నచ్చిన వారికే ఓటు వేస్తామని మహిళలు తెగేసి చెప్పారు. నాయకులు పద్దతి మార్చుకోవాలని వారు  హితవు పలికారు.

ఓటర్లకు డబ్బు పంచడం, తమకే ఓటు వేయాలని వారితో ప్రమాణం చేయించుకున్న వ్యవహారం స్థానికంగా సంచలనం రేపింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం  చెయ్యడం వివాదానికి దారితీసింది. గెలుపు కోసం అభ్యర్థులు డబ్బుని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. ఓటుకి వెయ్యి నుంచి 2వేల రూపాయలు ఇస్తున్నారనే  ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ స్థానాలకు సోమవారం (మే 6,219) పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 197 జెడ్పీటీసీ.. 2వేల166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి  ఉండగా.. 69 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2వేల 097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ స్థానాలకు 7వేల 72మంది,  జెడ్పీటీసీ స్థానాలకు 882మంది పోటీ పడుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 197 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.