ఎలక్షన్ టైం : తెలంగాణాలో మున్సిపోల్స్

  • Published By: madhu ,Published On : December 4, 2019 / 01:09 AM IST
ఎలక్షన్ టైం : తెలంగాణాలో మున్సిపోల్స్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండటంతో.. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 141 స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇందులో 128 మున్సిపాలిటీలు ఉండగా 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే పాలకమండలి గడువు తీరిన 121 మున్సిపాలిటీలకు, 10 కార్పొరేషన్లకు మాత్రం ప్రస్తుతం ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై అటు ప్రభుత్వం… ఇటు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో.. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు షెడ్యూల్ విడుదలైంది. మున్సిపల్ శాఖ దీనికి సంబంధించిన షెడ్యుల్‌ను విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వార్డుల పునర్విభజన షెడ్యుల్‌ను విడుదల చేశారు.

> డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ముసాయిదాపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తారు. 
> డిసెంబర్ 16వ తేదీ వరకు వినతులు, అభ్యంతరాల పరిష్కారానికి గడువు ఉంటుంది.
> డిసెంబర్ 17వ తేదీన పురపాలకశాఖ సంచాలకులకు వార్డుల పునర్విభజన జాబితా ఇస్తారు. 
> డిసెంబర్ 17వ తేదీ అధికారులు వార్డుల పునర్విభజన తుది జాబితాను ప్రకటిస్తారు.
> 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల పరిధిలో ఈ ప్రక్రియ జరుగుతుంది.
 
కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీంతో… ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. వార్డుల విభజన జరిగాక.. రిజర్వేషన్ల ఖరారుతో పాటు మేయర్ ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించాలా.. లేక పరోక్షంగా నిర్వహించాలనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ఇందులో
ఎన్నికలకు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించనున్నారు. పోలింగ్ బూత్‌లు, వార్డుల రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలపై చర్చిస్తారు. 

మరోవైపు ఓటర్ల జాబితా సవరణ కూడా మళ్లీ చేపట్టాలని హైకోర్టు సూచించడంతో.. అధికారులు ఆ పని కూడా పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు. 800 మంది ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న అధికారులు అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేసి.. ఈ నెలాఖరుకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల చివరి వారంలో విడుదల చేసి వచ్చే ఏడాది జనవరి చివరినాటికి ఎన్నికల నిర్వహణను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 
Read More : దిశా హత్య కేసు : నిందితుల కస్టడీపై సస్పెన్స్