మెగా ప్లాన్ : అన్నను బరిలోకి దింపిన తమ్ముడు

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 04:31 PM IST
మెగా ప్లాన్ : అన్నను బరిలోకి దింపిన తమ్ముడు

అమరావతి: మెగా బ్రదర్స్ పవన్‌ కల్యాణ్‌, నాగబాబు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో అన్నదమ్ములు బరిలో దిగారు. జనసేనలో చేరిన నాగబాబు నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతుండగా… ఇప్పటికే పవన్‌ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. కాపు సామాజికవర్గంతో పాటు మెగా అభిమానులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలనే ఎంపిక చేసుకున్నారు.

నామినేషన్లకు కొద్ది రోజులే సమయం ఉండడంతో ఏపీలో రాజకీయాలు గంటగంటకూ మారిపోతున్నాయి. ఇప్పటివరకు జనసేన కార్యకర్తగా కూడా లేని కొణిదెల నాగబాబు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి త‌మ్ముడికి అండదండ‌గా ఉంటూ వ‌స్తున్నారు నాగ‌బాబు. పార్టీలో చేర‌క‌పోయినా.. ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ మెగా అభిమానుల దృష్టిని ఆక‌ర్షించారు. 2018 డిసెంబర్‌లో నాగబాబు రూ.25 లక్షలు జనసేనకు విరాళంగా ప్రకటించారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ కోటి రూపాయలను విరాళమిచ్చారు. ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు ప్రత్యక్షమయ్యారు.

కొంతకాలం నుంచి యూట్యూబ్ చానెల్ ద్వారా జనసేనకు మద్దతుగా పనిచేస్తున్నారు. కానీ ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల వేళ పార్టీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. నాగబాటు పార్టీలో చేరడమే కాదు ఏకంగా లోక్‌సభకు కూడా పోటీ చేయబోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. గతంలో అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అది వీలు కాలేదు. కానీ, ఇప్పుడు తమ్ముడి పార్టీతో నాగబాబు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

అన్నయ్య నాగబాబును దొడ్డిదారిలో రాజకీయల్లోకి తీసుకురావడం లేదని.. రాజమార్గంలో ప్రజాక్షేత్రంలో నిలబెడుతున్నా అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి రాజకీయ చైతన్యం మొదలైందే నాగబాబుతోనని చెప్పారు. వరుసకు తనకు తమ్ముడే అయినా తనకు కూడా పవన్‌ నాయకుడేనని నాగబాబు అన్నారు. టికెట్‌ ఇచ్చినందుకు సోదరుడు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

జనసేన పార్టీకి, తన కుటుంబానికి ఏ సంబంధమూ లేదని.. ఎవర్నీ మద్దతు కూడా అడగబోనని పవన్ కల్యాణ్ చాలాసార్లు చెప్పారు. ఇప్పటి వరకూ ఆయన విధానం అదే. గతంలో.. మెగా ఫ్యామిలీలోని నాగబాబు నుంచి అల్లు అరవింద్ వరకూ అందరూ అదే చెప్పారు. నాగబాబు యూట్యూబ్ వీడియోల్లో.. తన తమ్ముడు జనసేన పార్టీకి, మెగా ఫ్యామిలీకి ఏ సంబంధమూ లేదని స్పష్టంగా ప్రకటించుకున్నారు. కొన్నాళ్ల క్రితం విరాళం ఇచ్చి కూడా అదే చెప్పారు. తమ్ముడి పార్టీకి విరాళం ఇవ్వగలను కానీ.. ప్రచారం చేయలేనన్నారు. ఆ తర్వాత అభిమానులను పోలీసులు కొట్టారని.. గుంటూరు వెళ్లి అక్కడ కూడా అదే చెప్పారు. తనకు జనసేనకు ఏ సంబంధం లేదని.. తాను జనసేన తరపున రాలేదన్నారు. అభిమానిగా అభిమానుల్ని పరామర్శించడానికి వచ్చానన్నారు. ఈ డైలాగులన్నీ యూ ట్యూబ్‌లో వైరల్‌ అవుతుండగానే.. కొత్తగా జనసేన తరపున ఎన్నికల బరిలో నిలబడటానికి వచ్చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల ఖరారు కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంది జనసేన. దరఖాస్తులు చేసుకున్న వారికే టికెట్లు ఇస్తామని స్పష్టంగా చెప్పింది. దాని ప్రకారం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో టెస్ట్ కూడా పెట్టారు. అందరిలాగే అధినేత పవన్ కల్యాణ్ కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు 2 చోట్ల పోటీ చేసే అవకాశాన్ని ఎన్నికల కమిటీ ఇచ్చింది. ఇప్పుడు పవన్ అన్న నాగబాబు మాత్రం హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో వచ్చేసి టికెట్ అందుకున్నారు. సామాజికవర్గం ఓట్ల అండాదండ ఉంటుందని భావిస్తున్న నియోజకవర్గం నుంచి పోటీకి బరిలోకి దిగుతున్నారు.

నాగబాబు రంగ ప్రవేశంతో నరసాపురం ఎంపీ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే టీడీపీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శివరామరాజును ప్రకటించింది. మొన్నటి వరకు ఆయన ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ కూడా నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజును బరిలోకి దింపింది.