న్యాయ పోరాటం చేస్తా : కాంగ్రెస్ నుంచి నగేశ్ సస్పెండ్

  • Published By: veegamteam ,Published On : May 13, 2019 / 10:47 AM IST
న్యాయ పోరాటం చేస్తా : కాంగ్రెస్ నుంచి నగేశ్ సస్పెండ్

ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్‌ను సస్పెండ్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 2019, శనివారం మే 11వ తేదీన ఇందిరా పార్కు దగ్గర ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో మాజీ ఎంపీ వీహెచ్ – నగేశ్‌ మధ్య సీటు విషయంలో గొడవ జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో.. నగేశ్‌ కూర్చునేందుకు ప్రయత్నించారు. దీన్ని వీహెచ్ అడ్డుకున్నారు. వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వీహెచ్ ను నెట్టేశారు నగేశ్. ఆ తర్వాత వీహెచ్.. నగేశ్ ను వేదిక పైనుంచి గెంటేశారు. వేదికపైనే తోపులాటలో ఇద్దరూ హల్ చల్ చేశారు.

ఈ ఘటనపై క్రమ శిక్షణ సంఘం రంగంలోకి దిగింది. చైర్మన్‌ కోదండరెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో సమావేశమైంది కమిటీ. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత నగేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  ఈ సమావేశంలో కో చైర్మన్‌ అనంతుల శ్యామ్‌ మోహన్‌, కన్వీనర్‌ కమలాకర్‌ రావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పార్టీ నుంచి సస్పెండ్ చేయటంపై నగేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, వీహెచ్ కు తొత్తుగా మారిందంటూ విమర్శించారు. వీహెచ్ ను కాపాడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు నగేశ్. నాపై జరిగిన దాడి, జరిగిన పరిణామాలపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. వీహెచ్ ను సేఫ్ చేయటం కోసమే క్రమశిక్షణ కమిటీ ఉందా అని నిలదీశారు. దీనిపై పోరాటం చేస్తానని.. అక్కడ ఏం జరిగింది అనేదానికి కుంతియానే సాక్ష్యం అన్నారు.