ముందు నుయ్యి వెనుక గొయ్యి : నెల్లూరు తమ్ముళ్ల తంటాలు

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 04:32 PM IST
ముందు నుయ్యి వెనుక గొయ్యి : నెల్లూరు తమ్ముళ్ల తంటాలు

నెల్లూరు: జిల్లాలోని ఓ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటివరకూ అక్కడ పోటీచేయని టీడీపీ.. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసి ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఒకపక్క పార్టీ అధిష్టానం గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తుంటే.. స్థానిక నాయకులు మాత్రం అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. మా ప్రమేయం లేకుండా అభ్యర్ధి ఎంపిక జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మేం సహకరించమంటూ తెగేసి చెపుతున్నారు. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించిన అధిష్టానానికి అభ్యర్ధి ఎంపిక సవాలుగా మారనుంది. 
తలనొప్పిగా మారిన రూరల్:
నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ టీడీపీ బలంగా ఉన్నప్పటికీ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి .. ఆ స్థానం నుంచి ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ప్రతీసారి పొత్తుల్లో భాగంగా మిత్ర పక్షాలకు కేటాయిస్తూ వస్తుంది. ఈసారి రూరల్ నుంచి టీడీపీ పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు మొన్నటి వరకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో నియోజకవర్గంలో టీడీపీ పట్టు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ రోజురోజుకీ బలపడుతున్నారు.  దీంతో ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టిన టీడీపీ అధిష్టానం.. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్ధులను నిలబెట్టాలని వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగా కొందరు పేర్లను పరిశీలిస్తోంది.  
అబ్దుల్ లేదా పెళ్లకూరుకి టికెట్:
నెల్లూరు సిటీ టిక్కెట్ ఆశిస్తున్న నగర మేయర్ అబ్ధుల్ అజీజ్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డిలో ఎవరో ఒకరిని బరిలోకి దింపాలని టీడీపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్ అబ్ధుల్ అజీజ్ కూడా రూరల్‌లో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన్ని నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నియోజకవర్గం నుంచి టిడిపి పోటీ చేయించాలనుకుంటున్న మరో నాయకులు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి. అటు ఆదాల, మంత్రి సోమిరెడ్డి ఇద్దరికీ సన్నిహితంగా ఉంటాడు. అయితే పెళ్లకూరు మాత్రం పోటీపై ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. 
ఆనంపై కన్ను:
మరోవైపు వైసీపీ నాయకులు ఆనం విజయకుమార్ రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి .. ఆయన్ని రూరల్‌లో పోటీ చేయించేలా కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఆనం విజయకుమార్‌తో చర్చలు జరిపినట్లు కూడా సమాచారం. ఆనం విజయకుమార్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన విజయకుమార్ రెడ్డి ..స్టేట్‌లో  కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిగా నిలిచాడు. దీంతో టీడీపీ కన్ను ఆనం విజయకుమార్‌ రెడ్డిపై పడింది. అబ్ధుల్ అజీజ్, పెళ్లకూరుతో పోల్చితే ఆనం విజయ కుమార్ రెడ్డి బెస్ట్ అన్నది టీడీపీ భావన.  
రెబెల్స్ బెదిరింపులు:
అసలే అభ్యర్ధుల ఎంపిక విషయంలో తలబొప్పి కడుతుంటే.. ఇప్పుడు స్ధానిక పార్టీ నేతలు అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. అభ్యర్ధి ఎంపిక విషయాన్ని తమతో చర్చించకుండా నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమంటూ తెగేసి చెపుతున్నారు. అభ్యర్ధి ఎవరైనా మాకు అభ్యంతరం లేదు. కాని మా ప్రమేయం లేకుండా అభ్యర్ధిని నిర్ణయిస్తే ఒప్పుకోమంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. రూరల్ పరిధిలోని ఓ హోటల్‌లో ఇదే విషయంపై స్థానిక టీడీపీ నాయకులంతా ఏకమై నిర్ణయించుకున్నారు. దీంతో అసలే ఈ నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీ చేయించాలని తర్జనభర్జన పడుతున్న క్రమంలో .. ఈ తిరుగుబావుటాలు పార్టీ అధిష్టానానికి మరింత తలనొప్పి తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఎన్నికల సమయానికి వీరిలో ఎవరో ఒకరు అభ్యర్ధిగా ఉంటారా? లేక సమీకరణలు మారి కొత్త వ్యక్తులు తెరమీదకు వస్తారా అనేది వేచి చూడాలి.