ఇలాంటి కొత్త చీఫ్‌ వస్తేనే.. టీ కాంగ్రెస్‌ బాగుపడతది!

  • Published By: sreehari ,Published On : February 20, 2020 / 04:19 PM IST
ఇలాంటి కొత్త చీఫ్‌ వస్తేనే.. టీ కాంగ్రెస్‌ బాగుపడతది!

తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీకి ఇప్పుడు కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయట. పార్టీ నిండా లీడ‌ర్లు ఉన్నారు. వారి వెనకాల అంతో ఇంతో జైకొట్టే కేడ‌ర్ కూడా ఉంది. మ‌రింకేం కావాలి. చ‌క్కగా పార్టీని ప్రజ‌ల్లోకి తీసుకొని వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేప‌ట్టవ‌చ్చు క‌దా అని అందరూ అంటున్నారు. కానీ, దానికి మాత్రం ఎవరికీ టైమ్‌ చిక్కడం లేదట. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ కేడర్‌లో నిరాశ, నిస్సత్తువ ఆవహించాయంటున్నారు. అయినా ప్రతి ఎన్నికల ముందు నేతలు మాత్రం బీరాలు పలుకుతున్నారని పార్టీలో కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. 

కొత్త చీఫ్ వస్తేనే :
కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఏదో ఒక కార్యక్రమానికి పిలుపివ్వడం.. సమన్వయం లేక అది ఫెయిల్‌ అవ్వడం కాంగ్రెస్‌లో తంతులా మారిందని చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో పార్టీ నేతల మాటల తూటాలే తప్ప కేడర్‌లో మాత్రం భరోసా కలగడం లేదంట. ఆ కార్యక్రమాలను మొక్కుబడిగా కానిచ్చేయడమే దీనికి కారణమంటున్నారు. ఇటీవ‌ల టీపీసీసీ చేప‌ట్టిన క్యాబ్ వ్యతిరేక ఉద్యమం, రిజ‌ర్వేష‌న్ల కుదింపుపై ఆందోళ‌న వంటి కార్యక్రమాలు ఉనికి చాటుకోవడానికే పనికొచ్చాయి. కానీ కేడ‌ర్‌లో మాత్రం అదే నిరుత్సాహం కనిపిస్తోంది. దానికి కారణం పీసీసీకి కొత్త నాయకుడు వస్తే తప్ప పార్టీ బాగుపడదనే టాక్‌ వినిపిస్తోంది. 

పార్టీ గాడిలో పడేనా? :
కొత్త నాయకుడు వస్తే కేడర్‌లో కొత్త ఉత్సాహం వస్తుందని అనుకుంటున్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకు రావాలంటే కొత్త నాయకుడు రావలసిందే అని కేడర్‌ కూడా భావిస్తోందంట. పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఎవరికి వారే తాము సక్సెస్‌ఫుల్‌ లీడర్‌నని గొప్పలు చెప్పుకుంటున్నారట. అంతే తప్ప కేడర్‌ మనసులో ఏముందో తెలుసుకొనే ప్రయత్నం మాత్రం చేయడం లేదంటున్నారు. నేతల మధ్య కూడా సఖ్యత కనిపించడం లేదు.

ఒకే వేదిక‌పై నేతలున్నా ఎవ‌రికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీలో ప్రస్తుతం వేళ్ల మీద లెక్కబెట్టేంత మంది మాత్రమే ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారు కూడా సరిగా కార్యక్రమాలకు హాజరు కావడంలేదు. కారణమేంటని అడిగితే తమకు సమాచారం లేదంటారు. ఎవరి మధ్య కూడా సమన్వయం లేదని కేడర్‌ ఫీలవుతోంది. ఇకనైనా కొత్త చీఫ్‌ వస్తేనే తప్ప పార్టీ గాడిలో పడే చాన్స్‌ లేదని కార్యకర్తలు అనుకుంటున్నారు.