టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్..! 

  • Published By: sreehari ,Published On : March 26, 2020 / 09:32 AM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్..! 

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలను బిజీబిజీగా ఉండేలా మార్చారు సీఎం కేసీఆర్‌. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో ఎమ్మెల్యేలంతా దాదాపు ఏడాది పాటు ఎన్నికల్లోనే బిజీ  అయ్యారు. ఆ వెంటనే ప్రభుత్వం తీసుకున్న రెండు కార్యక్రమాలు శాసనసభ్యులను మరోసారి గ్రామాల బాట పట్టించాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో  సమగ్ర ప్రణాళికను ఎమ్మెల్యేలు రూపొందించారు. నిత్యం ప్రజల్లో ఉండేలా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు నిన్న మొన్నటి వరకు జరిగాయి.

ప్రభుత్వం రైతుబంధు చెక్కులు పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమాన్ని కూడా ఈ నెలాఖరు లోపు మొదలు పెట్టాలని భావించింది. రూ. 25000 లోపు రుణం ఉన్న వారికి ఒకే విడతలో చెక్కుల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ 15 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

కరోనా కట్టడిపై పార్టీ నేతల అప్రమత్తం :
ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా తెలంగాణకు చేరుకుంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్… కరోనా కట్టడిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. పార్టీపరంగా నేతలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. స్వీయరక్షణతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు సీఎంవో సూచనలు ఇస్తోంది. 

ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అమాత్యులు ప్రజలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటూ…. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ సందేశాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. నేతలు ప్రత్యక్షంగా హాజరయ్యే కార్యక్రమాలకు కరోనాతో కాస్త విరామం దొరికినా కొత్త టెన్షన్ మాత్రం నేతల్లో మొదలైందట.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లోకి నేరుగా వెళ్లి కార్యక్రమాలు నిర్వహించేందుకు వీల్లేదు. ప్రజలందరినీ అప్రమత్తం చేసే విషయంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయడంతో వారంతా ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నారు.