లాయలిస్టులు వర్సెస్ జూనియర్లు.. పవర్‌లో ఉన్నా, లేకపోయినా తెలంగాణ కాంగ్రెస్‌లో అంతే

  • Published By: naveen ,Published On : July 18, 2020 / 03:51 PM IST
లాయలిస్టులు వర్సెస్ జూనియర్లు.. పవర్‌లో ఉన్నా, లేకపోయినా తెలంగాణ కాంగ్రెస్‌లో అంతే

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అలా ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువే. ఎవరైనా.. ఏమైనా మాట్లాడగలరు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు.. ఎప్పటి నుంచో ఉంటున్న వారు… ఇలా ఎవరికి మధ్య అంత సఖ్యత కనిపించదనే టాక్‌ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారంతా గళం వినిపిస్తున్నారు. తాము నమ్మి పార్టీలో చేరినప్పుడు పదవులు ఎందుకు ఇవ్వరని సీనియర్‌ నేతలను వారంతా ప్రశ్నిస్తున్నారు. అందుకు తమకు లేని అర్హతలేంటో చెప్పాలని.. తమ పదవులకు అడ్డుపడుతున్న సీనియర్లను నిలదిస్తున్నారు.

లాయలిస్టులు వర్సెస్ జూనియర్లు:
ఇటీవల కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా కంభంపల్లి సత్యన్నారాయణను ప్రకటించడం పట్ల సీనియర్ నేత వి.హనుమంతరావు గుర్రుగా ఉన్నారట. మొదటి నుంచి పార్టీకి లాయల్‌గా పని చేస్తున్న వారిని కాదనీ కొత్త వారికి ఎలా చాన్స్ ఇస్తారన్నది వీహెచ్‌ ప్రశ్న. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌లకు ఫోన్ల ద్వారా ఇదే విషయాన్ని వీహెచ్‌ అడుగుతున్నారట. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో ప్రత్యేక సమావేశం కావడంతో పార్టీలో మరోసారి లాయలిస్టులు వర్సెస్ జూనియర్లు అంశం తెర మీదకు వచ్చింది. ఇలా జూనియర్ల పట్ల వి.హనుమంతరావు వైఖరి పార్టీకి ఇబ్బందిగా మారిందని పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు.

పార్టీలో ఫైట్ చేసే లీడర్‌కే పీసీసీ చీఫ్‌గా అవకాశం ఇవ్వాలి:
పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నంత మాత్రాన ఇలా అంతర్గతంగా మాట్లాడుకోవలసిన విషయాలపై బహిరంగ ప్రకటనలు చేస్తూ పార్టీకి నష్టం కలగిస్తున్నారన్నది జూనియర్ల వాదన. ఇదే విషయంపై పార్టీ పెద్దలకు జూనియర్లు ఫిర్యాదు చేస్తున్నారు. రెండుసార్లు అధికారం కోల్పోయి.. టీఆర్ఎస్ దెబ్బకు విలవిల్లాడుతున్న కాంగ్రెస్ కేడర్‌ను కాపాడాల్సిన బాధ్యత మరిచి సొంత సమావేశాలు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. పార్టీలో బలహీనవర్గాలకు అవకాశం లేదని, పార్టీలో ఫైట్ చేసే లీడర్‌కే పీసీసీ చీఫ్‌గా అవకాశం ఇవ్వాలని వీహెచ్ వాదిస్తున్నారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు భట్టి విక్రమార్కపై కూడా అనేక సార్లు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి జూనియర్ కాబట్టి స్పీడ్ తగ్గించుకోవాలంటారు.

ఇలానే కొనసాగితే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిపోవడం ఖాయం:
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సీనియర్లు తమ అనుభావాన్ని పార్టీ కోసం ఉపయోగపడేలా చేయాలి తప్ప.. ఇలా గ్రూపులు కట్టి పార్టీకి మరింత నష్టం కలిగించేలా వ్యవహరించడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతో కొంత పార్టీ తరఫున పోరాడుతున్న వారికి పదవులు ఇస్తే తప్పేంటన్నది వారి వాదన. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పవర్‌లో ఉన్నా… లేకపోయినా తీరు మాత్రం మార్చుకోవడం లేదని కార్యకర్తలు అనుకుంటున్నారు. తమ ప్రతిష్ట తగ్గకుండా ఉండేందుకు గ్రూపులు కట్టడం, కామెంట్స్ చేయడం మాత్రం మానడం లేదని ఫీలవుతున్నారు. ఇలానే కొనసాగితే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిపోవడం ఖాయమని అంటున్నారు. మరి ఈ విషయమై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలంటున్నారు.